పుట:Oka-Yogi-Atmakatha.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయిన రాముణ్ణి బతికించడం

521

యోగాసనంలో కూర్చుని ఉండడం, తల తప్ప తక్కిన శరీరమంతా ఇసకలో కప్పబడి ఉండడం తరచు కనిపించేది.

1833 చలికాలంలో, పక్కనున్న జలంగీ నదీ ప్రవాహమార్గం మళ్ళడంవల్ల లాహిరీ కుటుంబం వారి ఆస్తి ధ్వంసమై గంగానదీ గర్భంలో కలిసిపోయింది. లాహిరీ వంశంవారు కట్టించిన శివాలయం ఒకటి, వారి ఇంటితో బాటుగా, ఏట్లో కలిసిపోయింది. శివలింగాన్ని మాత్రం భక్తు డొకడు, సుళ్ళు తిరుగుతున్న నీళ్ళలోంచి బయటికి తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు; ఆ చోటు నిప్పుడు ఘుర్ణీ శివస్థలమని అంటారు.

గౌర్ మోహన్ లాహిరీగారూ వారి కుటుంబమూ ఘుర్ణీ విడిచి పెట్టేసి కాశీవాసులయారు. తండ్రిగారు, వెంటనే అక్కడొక శివాలయం నిర్మించారు. వారు వైదికనిష్ఠానుసారంగా గృహస్థ ధర్మం నిర్వర్తించే వారు; దేవతార్చన, దానం, స్వాధ్యాయం యథావిధిగా చేసేవారు. ధర్మ పరాయణులూ విశాల హృదయులూ వారు. అయితే, ఉపయోగకరమైన ఆధునిక భావప్రవాహాన్ని వారు ఉపేక్షించలేదు.

బాల లాహిరీ, కాశీ అధ్యయన బృందాల్లో హిందీ, ఉర్దూ పాఠాలు నేర్చుకున్నాడు. జయనారాయణ ఘోషాల్‌గారు నడిపిన బడికి వెళ్ళి సంస్కృతం, బెంగాలీ, ఫ్రెంచి, ఇంగ్లీషు నేర్చుకున్నాడు. ఈ బాలయోగి నిశిత వేదాధ్యయనానికి పూనుకొని, నాగభట్టు అనే మహారాష్ట్ర పండితుడితో సహా అనేకమంది బ్రాహ్మణ పండితుల పరిషత్తులకు హాజరయి పవిత్ర గ్రంథాలగురించి వాళ్ళు చేసే చర్చలు వింటూండేవాడు.

శ్యామాచరణుడు దయాశీలుడు; సాధు స్వభావుడు, సాహస యువకుడు; సహచరులందరికీ ఇష్టుడు. మంచి ఆరోగ్యంగా, బలిష్టంగా ఉన్న శరీరానికి ఒడ్డూ పొడుగూ ఒకదానికొకటి సరిపడేటట్టు ఉండేవి; ఈతలోనూ శరీర వ్యాయామంలోనూ అందరినీ మించినవాడు.