పుట:Oka-Yogi-Atmakatha.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

520

ఒక యోగి ఆత్మకథ

లాహిరీ మహాశయుల జీవితాన్ని గురించీ ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం. మూడు దశాబ్దాలుగా నేను, భారతదేశంలోనూ అమెరికాలోనూ యూరప్‌ లోనూ, వారిచ్చిన ముక్తి ప్రదమైన యోగసందేశం పట్ల గాఢమైన, హృదయపూర్వకమైన ఆసక్తి ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈనాడు, ముందే ఆయన జోస్యం పలికినట్టు, ఆ యోగీశ్వరుల జీవితాన్ని గురించిన లిఖిత వృత్తాంతం ఒకటి అవసరముంది.[1]

లాహిరీ మహాశయులు 1828 సెప్టెంబరు 30 తేదీన, సనాతన పారంపర్యం గల ధర్మనిష్ఠాపరమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మస్థలం ఘుర్ణీ గ్రామం; ఇది బెంగాలులో, కృష్ణనగర్‌కు దగ్గర నదియా జిల్లాలో ఉంది. ఈయన, శ్రీమతి ముక్తకాశిగారి ఏకైక పుత్రులు. ఈ ఇల్లాలు, పూజ్యులయిన గౌర్ మోహన్ లాహిరీగారి రెండో భార్య (మొదటి భార్య, ముగ్గురు కొడుకుల్ని కన్న తరవాత ఒక యాత్రలో మరణించారు). పిల్లవాడి చిన్నతనంలోనే తల్లి కన్నుమూసింది; ఆవిడ, “యోగరాజు”గా పవిత్ర గ్రంథాల్లో పేర్కొనే శివుడి పరమభక్తురాలన్న అర్థవంతమైన యథార్థానికి మించి, ఆవిడగురించి మరేమీ తెలియదు.

లాహిరీ మహాశయుల పూర్తి పేరు శ్యామాచరణ్ లాహిరీ. చిన్న తనంలో ఈయన ఘుర్ణీలో పెద్దలు కట్టిన ఇంట్లోనే గడిపారు. మూడు నాలుగేళ్ళ వయస్సప్పుడు ఈయన ఇసకలోకి దూరి ఒక విధమైన

  1. శ్రీశ్రీ శ్యామాచరణ్ లాహిరీ మహాశయ అన్న పేరుతో స్వామి సత్యానంద బెంగాలీలో రాసిన చిన్న జీవిత చరిత్ర 1941 లో వెలువడింది.

    ఈ అధ్యాయంలో లాహిరీ మహాశయుల్ని గురించి రాయడానికి అందులోంచి కొన్ని భాగాలు అనువాదం చేశాను.