పుట:Oka-Yogi-Atmakatha.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయిన రాముణ్ణి బతికించడం

517

యోగవిద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా, నా జీవిత వృత్తాంతం ఒకటి రాయడం జరుగుతుంది. యోగవిద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని - అంటే, మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్షదర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని- నెలకొల్పడానికి తోడ్పడుతుందది,’ అని చెప్పారు.

“నాయనా, యోగానందా, ఆ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడంలోనూ ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చెయ్యాలి,” అన్నారు.

1895 లో లాహిరీ మహాశయులు పోయిన తరవాత, ఈ పుస్తకం పూర్తి అయిన 1945 సంవత్సరానికి ఏభై ఏళ్ళు గతించాయి. పైగా ఈ 1945 సంవత్సరమే యాదృచ్ఛికంగా, విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని ప్రవేశపెట్టడం గమనించి చకితుణ్ణి కాకుండా ఉండలేను. ఆలోచనాశీలమైన మనస్సులన్నీ ఇప్పుడు, ముందెన్నడూ లేనంతగా శాంతిసోదరత్వాల తక్షణ సమస్యలవేపు మళ్ళుతున్నాయి; అది జరగని నాడు, భౌతిక బలాన్ని వినియోగించడం ఇంకా కొనసాగిస్తూనే ఉంటే, సమస్యలతోబాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేస్తుందది.

కాల ప్రభావంవల్లనో బాంబువల్లనో, మానవజాతి దాని నిర్మాణాలూ నామరూపాలు లేకుండా మాయమయినప్పటికీ సూర్యుడు తన గతి తప్పడు; చుక్కలు యథావిధిగా మింటిని కావలికాస్తూనే ఉంటాయి. విశ్వ నియమాన్ని తాత్కాలికంగా, నిలుపుదల చెయ్యడంకాని, మార్చడంకాని సాధ్యం కాదు; మానవుడు దాంతో సామరస్యం పొందితే మంచిది. ఈ బ్రహ్మాండం, బలానికి వ్యతిరేకమయితే, సూర్యుడు అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా, నక్షత్రాలు తమ చిన్నారి ఏలుబడి సాగించడానికి అవకాశ మివ్వడం కోసం విధివిధేయంగా శ్రమిస్తుంటే