పుట:Oka-Yogi-Atmakatha.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయిన రాముణ్ణి బతికించడం

513

“మా స్నేహితుడిలో నిజంగా చావుకళ కనిపిస్తోంది. లాహిరీ మహాశయుల మాటలు నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థంకాలేదు. అయినా, త్వరత్వరగా కడబడుతున్న రాముడి ప్రాణం, ‘అంతా అయిపోయింది,’ అంటూ మనస్సుకు సూచిస్తూనే ఉంది. ఆ విధంగా నేను, విశ్వాస శంకలనే ఆటుపోటు కెరటాలమధ్య అల్లాడిపోతూ, నేను చెయ్యగలిగినంత బాగా, అతనికి ఉపచారం చేశాను. అతను ఉద్రేకపడి ఇలా అరిచాడు:

“ ‘యుక్తేశ్వర్, గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను పోయానని చెప్పు. అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు.’ ఈ మాటలతో రాముడు బరువుగా నిట్టూర్చి ప్రాణం విడిచాడు.”

“నేను ఒక గంటసేపు అతని మంచం దగ్గర ఏడ్చాను. ఎప్పుడూ ప్రశాంతిని కోరుకునే అతడు, ఇప్పుడు చావులో పూర్తి చిరశాంతి పొందాడు. ఇంకో సహాధ్యాయి లోపలికి వచ్చాడు; నేను తిరిగి వచ్చేదాకా అతన్ని ఇంట్లో ఉండమని చెప్పాను. సగం దిమ్మెరపోయి, కాళ్ళీడ్చు కుంటూ గురుదేవుల నివాసానికి మళ్ళీ వెళ్ళాను.

“ ‘రాముడెలా ఉన్నా డిప్పుడు?’ లాహిరీ మహాశయుల ముఖంలో చిరునవ్వులు విరుస్తున్నాయి.

“ ‘మహాశయా, ఎలా ఉన్నాడో మీరే కాస్సేపట్లో చూస్తారు,’ అంటూ ఆవేశం వెళ్ళగక్కాను. ‘ఇంకొన్ని గంటల్లో, స్మశానానికి తీసికెళ్ళే ముందు అతని కట్టెను చూద్దురుగాని,’ అంటూ వలవలా ఏడ్చేశాను.

“ ‘యుక్తేశ్వర్, మనసు బిక్కబట్టుకో, ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చెయ్యి.’ గురుదేవులు సమాధిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం, రాత్రి ఎడతెగని మౌనంలోనే గడిచిపోయాయి; నేను మనస్సు కుదుటబరుచుకోడానికి ఎంత గింజుకున్నా ఫలితం లేకపోయింది.