పుట:Oka-Yogi-Atmakatha.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

504

ఒక యోగి ఆత్మకథ

దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది; ఆ కారణం, అతనికే తప్ప మరొకరికి తెలియనంత సూక్ష్మంగా ఉంటుంది.

విశ్వ మాయాస్వప్నం నుంచి మేలుకొని, ఈ ప్రపంచాన్ని దివ్య మానసంలోని ఒక భావంగా అనుభూతి కావించుకొన్న మహాయోగులు, శరీరంతో ఏం కోరుకుంటే అది చెయ్యగలరు; దాన్ని వారు, ఘనీభూతశక్తికి కార్యసాధక రూపంగా తెలుసుకొని ఉంటారు. పదార్థమనేది ఘనీభూతమైన శక్తి తప్ప మరేమీ కాదని భౌతికశాస్త్రవేత్తలు ఇప్పుడయితే అవగాహన చేసుకుంటున్నారుకాని, పూర్ణసిద్ధి పొందిన యోగులు, పదార్థ నియంత్రణ విషయంలో, సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా సాగారు.

త్త్రైలింగస్వామి ఎప్పుడూ పూర్తిగా దిసిమొలతో ఉండేవారు. విసుగెత్తిన కాశీ పోలీసులు ఆయన్ని, ఇబ్బందుల్లో పెట్టే పిల్ల వాడిగా పరిగణించేవారు. ఈడెన్ తోటలో ఉన్న వెనకటి ఆదాము మాదిరిగానే ఈ ‘సహజస్వామి’కి తమ నగ్నత స్పృహలో ఉండేది కాదు. కాని పోలీసుల కది స్పృహలో ఉండేది. అందువల్ల ఆయన్ని అమర్యాదగా జైలుకు తీసుకు వెళ్ళారు. దాంతో కలవరం పుట్టింది; కాసేపట్లోనే, త్త్రైలింగస్వామివారి భారీ శరీరం, దాని సహజ పరిమాణమంతతో, జైలు పై కప్పులమీద కాన వచ్చింది. అప్పటికీ భద్రంగానే తాళంపెట్టి ఉన్న ఖైదుకొట్టు, అందులోంచి ఆయన తప్పించుకున్న విధానానికి ఆధారమేదీ చూపించలేదు.

నిరుత్సాహపడ్డ న్యాయాధికారులు మళ్ళీ మరోసారి తమ విధి నిర్వర్తించారు. ఈసారి స్వామివారి ఖైదుకొట్టు దగ్గర ఒక కావలివాణ్ణి నియమించారు. ధర్మం ముందునుంచి బలం మళ్ళీ మరోసారి నిష్క్రమించింది; కాసేపట్లోనే ఆ మహాయోగి, పై కప్పుమీద నిశ్చింతగా పచార్లుచేస్తూ కనిపించారు.