పుట:Oka-Yogi-Atmakatha.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

502

ఒక యోగి ఆత్మకథ

చీర కట్టుకుని ‘ఏనుగు చెవి’ మొక్కదగ్గిర నించుని ఉంది అన్నాను. తక్కిన శిష్యులందరూ కూడా అలాగే వర్ణించారు. గురుదేవులు మా యజమాని వేపు తిరిగారు. ‘ఆమెను గుర్తు పట్టారా?’ అన్నారు.

“ ‘గుర్తు పట్టానండి,’ అన్నాడతను. అతని స్వభావానికి అలవాటు లేని కొత్త ఉద్రేకాలతో పెనుగులాడుతున్నట్టు స్పష్టమవుతోంది. ‘నాకు మంచి భార్య ఉన్నా కూడా, ఈ మనిషికోసం తెలివితక్కువగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను. నే నిక్కడికి వేరే ఉద్దేశాలతో వచ్చినందుకు సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరిస్తారా?’ అని అడిగాడు.”

“ ‘ఆరు నెల్లపాటు నువ్వు మంచి నైతిక జీవనం గడిపేటట్టయితే నిన్ను స్వీకరిస్తాను,’ అని, ఇంకో ముక్క కూడా అన్నారు. ‘లేకపోతే నీకు దీక్ష ఇవ్వడం పడదు నాకు.’

“మూడు నెల్లదాకా వ్యామోహాన్ని నిగ్రహించుకున్నాడు మా యజమాని. ఆ తరవాత ఆవిడతో మళ్ళీ సంపర్కం కొనసాగించాడు. తరవాత రెండు నెల్లకు చనిపోయాడు. అతనికి దీక్ష ఇవ్వడం అసంభవమని గురుదేవులు గోప్యంగా చెప్పిన జోస్యాన్ని అప్పుడర్థంచేసుకున్నాను.”

లాహిరీ మహాశయులకు త్రైలింగస్వామి అనే సుప్రసిద్ధులైన స్నేహితులు ఉండేవారు; ఆయన వయస్సు మూడువందల ఏళ్ళకి పైబడి ఉండేదని ప్రతీతి. ఈ యోగులిద్దరూ తరచుగా ఒకచోట కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు. త్రైలింగ స్వాముల ప్రతిష్ఠ ఎంతగా వ్యాపించిందంటే, ఆయన చేసిన ఆశ్చర్యజనకమైన అలౌకిక చర్యలకు సంబంధించిన ఏ కథ అయినా సత్యదూరమని ఏ హిందువూ శంకించడు. ఏసుక్రీస్తే కనక ఈ లోకానికి తిరిగివచ్చి తన దివ్యశక్తులు ప్రదర్శిస్తూ న్యూయార్కు