పుట:Oka-Yogi-Atmakatha.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

487

“పట్టిపట్టి చూడు!” అంటూ ఒక మృదుస్వరం, నా అంతశ్చేతనతో పలికింది. “ఇప్పుడు ఫ్రాన్సులో నటిస్తున్న ఈ దృశ్యాలు, వెలుగు నీడల సయ్యాటలు తప్ప మరేమీ కావని గమనిస్తావు. ఇవి విశ్వచలనచిత్ర దృశ్యాలు; ఒక నాటకంలో అంతర్నాటకంలా- ఇంతకుముందు సువ్వు చూసిన సినిమా న్యూస్ రీల్ ఎంత నిజమైనదో ఇవి అంత నిజమైనవి, లేదా అది ఎంత అబద్ధమైనదో ఇవి అంత అబద్ధమైనవి.”

నా గుండె ఇంకా కుదుటబడలేదు. దివ్యవాణి ఇంకా చెప్పింది: “సృష్టి, వెలుగు నీడా - రెండూను; లేకపోతే బొమ్మ రావడం అసంభవం. మాయాపరమయిన మంచిచెడ్డలు, ఒకదాని తరవాత మరొకటి ఎప్పటికీ ప్రాబల్యం పొందుతూనే ఉంటాయి. ఈ లోకంలో, ఆనందం అనంతంగానే కనక ఉండి ఉంటే, మానవుడు ఎన్నడయినా మరొకదాన్ని కోరుకుంటాడా? బాధ లేనిదే, తాను తన నిత్యనివాసాన్ని విడిచిపెట్టానన్న సంగతి గుర్తు చేసుకోడానికి ఒక్కనాటికి ప్రయత్నించడు. బాధ అనేది జ్ఞాపకానికి ములుగర్ర. దీన్ని తప్పించుకొనే ఉపాయం జ్ఞానం. మరణమనే విషాదం అవాస్తవం; దాన్ని తలుచుకొని గడగడలాడేవాళ్ళు, రంగస్థలం మీద జరుగుతున్న నాటకంలో తన మీదికి పేల్చింది ఖాళీ తూటాయే అయినా జడుసుకొని ప్రాణంవిడిచే అవివేకపు నటుడిలాంటి వాళ్ళు. నా పిల్లలు వెలుతురు మొలకలు; వాళ్ళు ఎల్లకాలం మాయలోనే నిద్రపోతూ ఉండరు.”

నే నంతకుముందు, మాయను గురించి ధార్మిక గ్రంథాల్లో రాసినవి చదివే ఉన్నప్పటికీ, సొంతగా కలిగిన అంతర్దర్శనానుభవంతోనూ దాంతోబాటు వినవచ్చిన అనునయ వాక్యాలతోనూ కలిగినంత గాఢమైన అంతర్దృష్టి ఆ గ్రంథాలవల్ల కలగలేదు. సృష్టి అనేది కేవలం, బృహత్తరమైన ఒక చలన చిత్రమేననీ తన సత్త (ఉనికి) దాంట్లో కాకుండా,