పుట:Oka-Yogi-Atmakatha.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

486

ఒక యోగి ఆత్మకథ

కూడా వాస్తవికతా భ్రాంతి కలిగిస్తాయి. అసంఖ్యాక జీవరాశులు గల గ్రహగోళాలు, ఒకానొక విశ్వచలనచిత్రంలోని ఆకృతులే తప్ప మరేమీ కావు. మానవుడి జ్ఞానేంద్రియా లైదింటికీ తాత్కాలికంగా నిజమనిపించే ఈ అనిత్య దృశ్యాలు, మానవ చైతన్యమనే తెరమీద, అనంత సృజనాత్మక కిరణం ప్రసరింపజేసినవే.

సినిమా ప్రేక్షకుడు తలపైకి ఎత్తి, తెరమీది బొమ్మలన్నీ నిరాకారమైన ఒక కాంతి కిరణం ద్వారానే కనిపిస్తున్నట్టు చూడవచ్చు. వన్నె వన్నెల జగన్నాటకం కూడా అదే మాదిరిగా, ఒక విశ్వమూలం తాలూకు ఏకైక శ్వేతకాంతినుంచే వెలువడుతోంది. దేవుడు తన పిల్లలకోసం, అనూహ్యమైన చాతుర్యంతో తన గ్రహప్రదర్శనశాలలో “అధికతమ బ్రహ్మాండ” వినోదాన్ని ప్రదర్శిస్తున్నాడు; వాళ్ళనే నటీనటుల్నీ ప్రేక్షకుల్నీ చేస్తున్నాడు.

ఒకనాడు నేను, యూరప్ యుద్ధరంగాలకు సంబంధించిన న్యూస్ రీల్ చూడ్డానికి ఒక సినిమా హాల్లోకి ప్రవేశించాను. పాశ్చాత్యంలో మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా చెలరేగుతూనే ఉంది; మారణ కాండను ఆ న్యూస్ రీల్ ఎంత వాస్తవికంగా చూపించిందంటే, నేను హృదయ వ్యథతో హాల్లోంచి బయటికి వచ్చేశాను.

“ప్రభూ, అటువంటి బాధను నువ్వెందుకు అనుమతిస్తావు?” అని ప్రార్థించాను.

నాకు అత్యంత ఆశ్చర్యం కలిగే విధంగా, నిజమైన యూరప్ యుద్ధరంగాల అంతర్దర్శన రూపంలో, తక్షణమే నాకు సమాధానం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళతోటి, పోతూఉన్న వాళ్ళతోటి నిండిఉన్న దృశ్యాలు, ఏ న్యూస్‌రీల్ ప్రదర్శనకయినా ఎంతో మించి ఉండేటంత భయంకరంగా ఉన్నాయి.