పుట:Oka-Yogi-Atmakatha.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

485

ప్రజ్ఞతో సంచాలితమయ్యే కాంతి అనే ఏకైక శక్తికి వివిధరూపాల అభివ్యక్తిగా గ్రహించడానికి అనేక ఆధునిక ఆవిష్కరణలు మానవుడికి తోడ్పడతాయి. చలనచిత్రం, రేడియో, టెలివిజన్, రేడార్, కాంతి విద్యుద్ఘటం (ఫొటో ఎలక్ట్రిక్ సెల్)- ఆశ్చర్యకరమైన “విద్యున్నేత్రం” (ఎలక్ట్రిక్ ఐ), పరమాణు శక్తులు అనే అద్భుతాలన్నీ కాంతికున్న విద్యుదయస్కాంత దృగ్విషయం మీద ఆధారపడ్డవే.

చలన చిత్రకళ ఏ అలౌకిక ఘటననయినా చిత్రీకరించగలదు. ప్రభావోత్పాదక దృశ్య దృక్కోణం నుంచి, ట్రిక్ ఫొటోగ్రఫీకి వశం కాని అద్భుతమంటూ ఏదీ లేదు. మానవుణ్ణి, స్థూలమైన భౌతికకాయం నుంచి లేస్తున్న పారదర్శక సూక్ష్మ శరీరంగా చూడవచ్చు; అతను నీళ్ళ మీద నడవగలడు, చనిపోయినవాళ్ళను తిరిగి బతికించవచ్చు, వికాసాల్లోని సహజక్రమాన్ని ముందు వెనకలు చెయ్యవచ్చు, దేశకాలాల్ని అస్తవ్యస్తం చేసి పారెయ్యవచ్చు. నేర్పరి అయినవాడు ఛాయాచిత్ర బింబాల్ని తన ఇష్టం వచ్చినట్టు కూర్చవచ్చు; నిజమైన సిద్ధపురుషుడు వాస్తవమైన కాంతి కిరణాలతో చేసే మాదిరిగానే దృష్టి విభ్రమాలు సాధించవచ్చు.

సజీవ సాదృశ్యంగల బింబాల్ని ప్రదర్శించే చలన చిత్రాలు, సృష్టికి సంబంధించిన అనేక సత్యాల్ని కళ్ళకు కట్టిస్తాయి. విశ్వ (చలన చిత్ర) దర్శకుడు తన నాటకాలు తనే రాసుకుంటాడు; అనేక శతాబ్దాల వేడుక కోసం, భారీ సంఖ్యలో పాత్రల్ని సమకూరుస్తాడు. అనంతత్వమనే అంధకార శిబిరంలోంచి ఆయన, యుగయుగాంతరాల ఫిల్ములగుండా తన కాంతి కిరణాల్ని ప్రసరింపజేస్తాడు; మహాకాశమనే తెరమీద బొమ్మలు పడుతూ ఉంటాయి.

సినిమా బొమ్మలు వాస్తవాలుగా కనిపించినప్పటికీ, అవి కేవలం వెలుగునీడల కలయికలు మాత్రం అయినట్టు విశ్వసంబంధమైన రూపాలు