పుట:Oka-Yogi-Atmakatha.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

483

ఈ విశ్వంమీద తన ఆధిపత్యాన్ని తెలుసుకొని మాయకు అధికారిగా అతడు పెరగాలని.

1915 లో, నేను సన్యాసం తీసుకున్న కొత్తలో, పరస్పర వైరుద్ధ్యాలుగల అంతర్దర్శనం ఒకటి అనుభూతమయింది. అందులో, మానవ చేతన సాపేక్షత స్పష్టంగా రూఢి అయింది; మాయా సంబంధమైన బాధాకరమైన ద్వంద్వాలకు వెనక ఉన్న శాశ్వత కాంతి అఖండతను స్పష్టంగా దర్శించాను. ఒకనాడు పొద్దున, గుర్పార్ రోడ్డులో ఉన్న నాన్నగారి ఇంట్లో, నా చిన్న అటకగదిలో కూర్చుని ఉండగా నాకు ఈ దర్శనం కలిగింది. అప్పటికి కొన్ని నెలలుగా, మొదటి ప్రపంచయుద్ధం యూరప్‌లో చెలరేగుతూ ఉంది; అధిక సంఖ్యలో సంభవిస్తున్న మరణాల్ని గురించి నేను దిగులుగా ఆలోచిస్తూ ఉన్నాను.

నేను ధ్యానంలో కళ్ళు మూసుకునే సరికి, నా చైతన్యం హఠాత్తుగా, ఒక యుద్ధనౌకమీద ఆధిపత్యంవహించి ఉన్న ఒక కెప్టెన్ శరీరంలోకి బదిలీ అయింది. అటు ఒడ్డున ఉన్న ఫిరంగులూ ఇటు ఓడ ఫిరంగులూ ఒకదానిమీద ఒకటి కాల్పులు జరుపుతూ ఉండగా ఆకాశం దద్దరిల్లి పోతోంది. ఒక పెద్ద ఫిరంగిగుండు వచ్చి మా మందుగుండు కొట్టుకు తగిలి, నా ఓడను బద్దలు చేసింది. ఈ పేలుడులో బతికిన కొద్దిమంది నావికులతోబాటు నేను కూడా నీళ్ళలోకి దూకాను.

గుండె దడదడలాడుతూ ఉండగా, నేను సురక్షితంగా ఒడ్డుకు చేరాను. కాని దురదృష్టం! చెదురుపాటుగా వచ్చిపడ్డ గుండు ఒకటి నా ఛాతీలోకి దూసుకుపోయింది. నేను మూలుగుతూ నేలమీద పడ్డాను. నా శరీరమంతా పక్షవాతం వచ్చినట్టుగా అయింది. అయినా తిమ్మిరెక్కిన కాలు తెలుస్తూనే ఉన్నట్టుగా, నాకు శరీరం మీద స్పృహ తెలుస్తూనే ఉంది.