పుట:Oka-Yogi-Atmakatha.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

474

ఒక యోగి ఆత్మకథ

చడం జరిగింది. విశ్వభ్రాంతిని పట్టుకుని పాకులాడేవాళ్ళు దాని ధ్రువత్వ నియమాన్ని - అంటే ఆటూ పోటూ, లేవడమూ పడడమూ, పగలు రాత్రీ, సుఖమూ దుఃఖమూ, మంచీ చెడూ, పుట్టుకా చావూ అన్న వాటిని అంగీకరించక తప్పదు. మనిషికి కొన్ని వేల మానవజన్మలు గడిచి వచ్చిన తరవాత ఈ చక్రగతిక్రమం, వేదనాభరితమైన ఒక రకం విసుగుదలను కలిగిస్తుంది; అప్పుడతను, మాయామయ నిర్బంధాల వెలుపలికి ఆశగా దృష్టి సారించడం మొదలుపెడతాడు.

మాయ అనే ముసుగును తొలగించడమంటే, సృష్టి రహస్యాన్ని భేదించడమన్న మాట. ఈ విధంగా విశ్వాన్ని నగ్నీకరించేవాడే నిజమైన ఏకేశ్వరోపాసకుడు. తక్కినవాళ్ళందరూ ధర్మవిరుద్ధమైన విగ్రహాల్ని ఆరాధిస్తున్నవాళ్ళే. మనిషి, ప్రకృతి తాలూకు ద్వంద్వతామాయలకు అధీనుడై ఉన్నంతకాలం, ద్వంద్వముఖాలు గల మాయే అతనికి ఆరాధ్య దేవత; ఏకైక సత్యదైవాన్ని అతను తెలుసుకోడు.

మాయ అనే ప్రపంచ భ్రాంతి, మనుషుల్లో అవిద్యగా పొడచూపుతుంది; అవిద్య అంటే, “జ్ఞానం కానిది,” అజ్ఞానం, మాయ. ఈ ‘మాయ’ లేదా ‘అవిద్య’ తార్కిక దృఢవిశ్వాసంవల్లకాని విశ్లేషణవల్లకాని ఎన్నడూ నాశనం కాజాలదు; కేవలం నిర్వికల్ప సమాధి అనే ఆంతరిక స్థితిని సారించడం ద్వారా మాత్రమే నాశనమవుతుంది. బైబిలు పాత నిబంధన గ్రంథ ప్రవక్తలూ అన్ని దేశాల ద్రష్టలూ మునులూ ఆ చైతన్య స్థితిలో ఉండే పలికారు.

ఎజెకీల్ ఇలా అన్నాడు: “తరవాత ఆయన నన్ను గుమ్మం దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం సైతం తూర్పువేపు ఉంది: ఇజ్రాయల్ దేవుడి శోభ తూర్పుదిక్కు నుంచి ప్రసరించింది: ఆయన స్వరం సముద్ర ఘోషలా ఉంది: ఆయన శోభతో ప్రకాశించింది భూమి”