పుట:Oka-Yogi-Atmakatha.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 29

రవీంద్రనాథ్ టాగూరు, నేను

విద్యాలయాల్ని పోల్చిచూడడం

“ఆత్మాభివ్యక్తికి సహజమైన రూపంలో, పక్షులు పాడినంత అవలీలగా పాడడం రవీంద్రనాథ్ టాగూరుగారు నేర్పారు మాకు.”

మా రాంచీ విద్యాలయంలో చదివే పధ్నాలుగేళ్ళ కుర్రవాడు భోలానాథ్ చెప్పిన సంగతి ఇది. ఒకనాడు పొద్దున, అతను పాడిన శ్రావ్యమైన పాటలకు నేను అభినందించినప్పుడు చెప్పాడిది. ప్రేరణ ఉన్నా లేకపోయినా కూడా, ఆ అబ్బాయి రాగయుక్తంగా గానం చేశాడు. అంతకుముందు ఆతను బోల్పూరులో టాగూరుగారి “శాంతి నికేతనం” అనే ప్రసిద్ధ విద్యాలయంలో చదివాడు.

“రవీంద్రుల పాటలు చిన్నప్పటినించీ నా పెదవులమీద ఆడుతూనే ఉన్నాయి,” అన్నాను అతనితో. “అక్షరాలు రాని రైతులతో సహా, బెంగాలీ లందరూ ఆయన మహోన్నత కవిత్వానికి ముచ్చటపడతారు.”

బోలా, నేనూ కలిసి టాగూరు పాటలు కొన్ని కలిసి పాడుతున్నాం. ఆయన కొన్ని వేల భారతీయ కవితలకు స్వరకల్పన చేశారు; వాటిలో కొన్ని ఆయన రాసినవీ, కొన్ని పూర్వకవులవీ.

“రవీంద్రనాథ్‌గారు సాహిత్యానికి నోబెల్ బహుమానం తీసుకున్న క్రొత్తలో నేను ఆయన్ని కలుసుకున్నాను.” అన్నాను నేను, పాటలు