పుట:Oka-Yogi-Atmakatha.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ పునర్జన్మ, వెల్లడి

459

నేనూ నా స్నేహితులూ సర్పెంటైన్ లేన్‌లోకి నడిచాం; పైకెత్తి ఉన్న నా చేతుల్లో స్పందనలు బలమయి, వెనకటికన్న స్పష్టమయాయి. ఏదో ఒక అయాస్కాంత శక్తి పనిచేసి నన్ను రోడ్డుకు కుడిపక్కకు లాగేసింది. ఒక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి నా కాళ్ళు స్తంభించి పోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఊపిరి కూడా బిగబట్టేసి గాఢమైన ఉద్రేకంతో తలుపు తట్టాను.

ఒక పనిమనిషి వచ్చి తలుపు తీసింది; అయ్యగారు ఇంట్లోనే ఉన్నారని చెప్పింది. ఆయన రెండో అంతస్తు నుంచి మెట్లు దిగివచ్చి సంగతి ఏమిటన్నట్టుగా నావేపు చిరునవ్వు నవ్వారు. నేను అడగదలచుకున్న ప్రశ్న ఎలా ఉండాలో మనస్సులో ఇంకా అనుకోనే లేదు; అది ఒక రకంగా సంగతమూ మరో రకంగా అసంగతమూ కూడా.

“ఏమండీ, మీరూ మీ భార్యా, సంతానం కలుగుతుందని సుమారు ఆరు నెలల నుంచి ఎదురుచూస్తున్నారా? దయచేసి చెప్పండి.”[1]

  1. చాలామంది మానవులు భౌతికంగా మరణించిన తరవాత, సూక్ష్మ లోకంలో 500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉంటుంటారు కాని, జన్మకూ జన్మకూ మధ్య ఇంత వ్యవధి ఉండాలన్న నిశ్చిత నియమం ఏదీ లేదు (45 ఆధ్యాయం చూడండి). భౌతిక శరీరంలోకాని, సూక్ష్మ శరీరంలోకాని ఒక మనిషికి కేటాయించిన జీవితకాలం, అతని కర్మానుసారంగా పూర్వనిర్ధారితమై ఉంటుంది. చావూ, “చిన్న చావు” అనిపించుకునే నిద్రా కూడా మర్త్యులకు ఆవశ్యకమైనవే; ఆత్మసాక్షాత్కారం పొందని జీవిని ఇవి, ఇంద్రియ బంధనాల నుంచి తాత్కాలికంగా విముక్తంచేస్తాయి. మానవుడి మౌలిక ప్రకృతి ఆత్మ కనక, అతడు నిద్రలోనూ చావులోనూ తన అశరీరత్వాన్ని పునరుజ్జీవింప జేసే జ్ఞాపికలు కొన్ని పొందుతాడు.

    హిందూ పవిత్ర గ్రంథాల్లో చెప్పిన ప్రకారం, సమతులన కర్మనియమం, చర్యా ప్రతిచర్యలకూ, కార్యకారణాలకూ, బీజావాప ఫలోపలబ్ధులకూ సంబంధించినది. ప్రతి మనిషి తన నైసర్గిక ధర్మ(ఋతం)వర్తనలో, తన ఆలోచనల ద్వారానూ చేతల ద్వారానూ తన భవితవ్యాన్ని తానే మలుచుకుంటాడు. తెలివిగానో తెలివితక్కువగానో అతడు చాలనంచేసిన విశ్వశక్తులు, ఒక బిందువు దగ్గర మొదలైన వృత్తపరిధి తప్పనిసరిగా ఆ బిందువు దగ్గరికే తిరిగి వచ్చి వృత్తం పూర్తి అయినట్టుగా, ఆరంభ కేంద్రమయిన అతని దగ్గరికి తప్పనిసరిగా తిరిగి రావాలి. “ఈ ప్రపంచం ఒక గణిత సమీకరణంలా కనిపిస్తుంది, నువ్వు దాన్ని ఎలా తిప్పు- దానంతట అది సమతులనం చేసుకుంటుంది. నిశ్శబ్దంగానూ నిశ్చయంగానూ, ప్రతి రహస్యమూ వెల్లడి అవుతుంది, ప్రతి నేరానికి శిక్ష పడుతుంది; ప్రతి సుగుణానికి బహుమతి వస్తుంది; ప్రతి అన్యాయానికీ పరిహారం లభిస్తుంది.” (ఎమర్సన్ , ‘కాంపెన్సేషన్’ లో). జీవిత అసమానతల వెనక ఉన్న కర్మను న్యాయసూత్రంగా అవగాహన చేసుకున్నప్పుడు, మానవ మనస్సులో దేవుడిమీదా మానవుడిమీదా ఉన్న ఆగ్రహం తొలగిపోవడానికి అది తోడ్పడుతుంది.