పుట:Oka-Yogi-Atmakatha.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

458

ఒక యోగి ఆత్మకథ

కలకత్తాలో జనసమ్మర్దంగా ఉన్న బౌ బజార్ అనే పేటలో కొంతమంది స్నేహితులతోబాటు నడుస్తూ, మామూలు పద్ధతిలో చేతులు పైకి ఎత్తాను. మొట్టమొదటి సారిగా ప్రతిస్పందన వచ్చింది. నా వేళ్ళ లోంచీ అరిచేతుల్లోంచీ విద్యుదావేగాలు లోపలికి ప్రసరిస్తూ ఉండడం కనిపెట్టి పులకించి పోయాను. ఆ విద్యుత్ ప్రవాహాలు నా చైతన్యంలోని ఒకానొక గహనాంతర స్థానం నుంచి అత్యంత ప్రబలమైన ఆలోచనగా రూపాంతరం చెందాయి. “నేను కాశీని, నేను కాశీని; నా దగ్గరకి రండి!”

నేను హృదయమనే వీడియో మీద ఏకాగ్రత నిలిపినప్పుడు, ఆ ఆలోచన దాదాపుగా నా చెవికి వినవచ్చింది. కాశీకి[1] సహజ లక్షణమైన కొద్దిపాటి బొంగురు గొంతుతో గుసగుసలాడుతున్నట్టుగా పిలిచిన పిలుపును మళ్ళీ మళ్ళీ విన్నాను. నా స్నేహితుడొకడి చెయ్యి గుంజి పట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాను.

“కాశీ ఎక్కడున్నది నేను తెలుసుకున్నట్టు అనిపిస్తోంది!”

నేను గిరగిరా తిరగడం ప్రారంభించాను; నా స్నేహితులూ దారిని పోయే జనమూ చోద్యంగా చూస్తున్నారు. నేను దగ్గరిలో ఉన్న ఒక సందు వేపు తిరిగి ఉన్నప్పుడు మాత్రమే నా వేళ్ళలో విద్యుత్తరంగాలు జల్లుమనిపిస్తున్నాయి; ఆ సందుకు ‘సర్పెంటైన్ లేన్’ (పాము సందు) అన్న పేరు సరిగానే సరిపోయింది. నేను తక్కిన వేపులకు తిరిగినప్పుడు ఆ సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలు అంతరించాయి.

“ఆఁహాఁ! కాశీ ఆత్మ. ఈ సందులో ఒక ఇంట్లో, ఒక తల్లి కడుపులో ఉందన్న మాట!” అనుకున్నాను.

  1. ప్రతి ఆత్మా పరిశుద్ధ స్థితిలో, సర్వజ్ఞత్వ మున్నదే. కాశీ ఆత్మ, కాశీ అనే పిల్లవాడి సహజ లక్షణాలన్నీ గుర్తుంచుకుంది; కనక నే నతన్ని గుర్తు పట్టేలా చెయ్యడానికని అతని బొంగురు గొంతను అనుకరించింది.