పుట:Oka-Yogi-Atmakatha.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

452

ఒక యోగి ఆత్మకథ

చూశారు; కాని అప్పటికే ఒళ్ళు చల్ల బడింది. కొయ్యబారిన శరీరం మట్టుకే మిగిలింది; అద్దెకున్నవాడు అమరలోక తీరానికి పలాయనం చేశాడు.

సనందుడు చెప్పేది పూర్తి అవుతూంటే నేను అనుకున్నాను: “ఈ ‘రెండు శరీరాల సాధువు’గారు జీవితంలోనే కాక మరణంలో కూడా నాటకీయత ప్రదర్శించారు!”

ప్రణవానందగారు మళ్ళీ ఎక్కడ పుడతారని అడిగాను.

“ఆ సమాచారాన్ని పవిత్ర రహస్యంగా పరిగణిస్తున్నాను,” అని జవాబిచ్చాడు సనందుడు. “నే నది ఎవరికీ చెప్పగూడదు. బహుశా నువ్వుదాన్ని మరోరకంగా తెలుసుకోవచ్చు.”

చాలా ఏళ్ళ తరవాత స్వామి కేశవానంద[1]గారి దగ్గర ఆ విషయం తెలుసుకున్నాను. ప్రణవానందగారు, చనిపోయిన కొన్నేళ్ళకి కొత్త దేహంతో జన్మించి హిమాలయాల్లో బదరీనారాయణకు వెళ్ళారని, అక్కడ మహావతార బాబాజీ సన్నిధిలో ఉండే సాధుబృందంలో కలిశారని తెలిసింది.

  1. నేను కేశవానందగారిని కలుసుకోడం గురించి. 42 అధ్యాయంలో వివరించడం జరిగింది.