పుట:Oka-Yogi-Atmakatha.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాంచీలో యోగవిద్యాలయ స్థాపన

447

“కుర్రవాళ్ళకు సరయిన శిక్షణ ఇవ్వడానికి లాహిరీ మహాశయులు ఉద్దేశించిన ఆదర్శాల్ని ఈ సంస్థలో అమలుజరపడం చూస్తుంటే, నా హృదయంలో ఆనందం కలుగుతోంది. దీనికి మా గురుదేవుల ఆశీస్సులు ఉండుగాక!” అన్నారాయన.

నా పక్కనే కూర్చున్న ఒక చిన్న కుర్రవాడు, ఆ మహాయోగిని ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు.

“అయ్యా, నేను సన్యాసి నవుతానా? నా జీవితం దేవుడికే అంకిత మవుతుందా?” అని అడిగాడు.

స్వామి ప్రణవానందగారు మృదువుగా చిరునవ్వు చిందించినా, ఆయన కళ్ళు భవిష్యత్తులోకి గుచ్చిగుచ్చి చూస్తున్నాయి.

“బాబూ, నువ్వు పెద్ద అయేసరికి, నీ కోసం ఒక చక్కని కన్నె పిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది.” (ఆ అబ్బాయి సన్యాసం తీసుకోవాలని కొన్నేళ్ళపాటు పథకం వేసుకుని, చివరికి పెళ్ళి చేసేసుకున్నాడు).

స్వామి ప్రణవానందగారు రాంచీ సందర్శించిన కొంత కాలానికి కలకత్తాలో ఆయన తాత్కాలికంగా బసచేసిన ఇంటికి, మా నాన్నగారితో కలిసి నేను కూడా వెళ్ళాను. “తరవాత, మీ నాన్నగారితోబాటు చూస్తాను నిన్ను,” అంటూ ప్రణవానందగారు చాలా ఏళ్ళ కిందట చెప్పిన జోస్యం చటుక్కున నా మనస్సుకు స్ఫురించింది.

నాన్నగారు స్వాములవారి గదిలో అడుగుపెట్టగానే, ఆ మహాయోగి తమ ఆసనం మీంచి లేచి, ఆయన్ని ప్రేమపూర్వకమైన గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు.

“భగవతిగారూ, మీ గురించి మీరు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి అనంతంలోకి వేగంగా దూసుకుపోతూండడం గమనించలేదా?” అంటూ