పుట:Oka-Yogi-Atmakatha.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు

27

నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతంపట్టి నన్ను తరుముకొచ్చాడు; నేను విచారంగా, బెరైలీకి తిరిగి రావలసివచ్చింది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్ర అల్లా, పొద్దుటిపూట మామూలుగా ఆ ‘సేవాలి’ చెట్టుదగ్గరికి వెళ్ళడం మట్టుకే. నేను పోగొట్టుకొన్న ఇద్దరు తల్లులకోసం - ఒకరు మానవరూపంలో ఉన్నవారు, మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు- నా గుండె వలవలా ఏడ్చింది.

అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది. తరవాత జీవించిన నలభై ఏళ్ళలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్ళి చేసుకో లేదు. ఈ పిల్లలకి తల్లీ - తండ్రి తామే అయారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో, ఆయనలో గుర్తించదగినంత మార్దవం పెరిగింది; ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసువేళల తరవాత, ఒక మునిమాదిరిగా, తమ గదిలోకి వెళ్ళిపోయి, ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధనచేస్తూ ఉండేవారు. మా అమ్మపోయిన చాలా కాలానికి, నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా, చిన్నచిన్న పనులు చూడటానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని ప్రయత్నించాను. కాని నాన్నగారు తల తిప్పేశారు. “నాకు సేవ అన్నది మీ అమ్మతోనే అంతమైంది.” ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో, జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. “మరో ఆడది ఎవరూ సేవ చేయ్యడానికి నేను ఒప్పుకోను.”

అమ్మ పోయిన పద్నాలుగు నెలల తరవాత, ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడమంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అయితే ఆ సంగతి, ఒక ఏడాది