పుట:Oka-Yogi-Atmakatha.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాంచీలో యోగవిద్యాలయ స్థాపన

439

ఆయన సలహా నన్ను గాఢంగా కదిలించింది. నేను పైకేమీ జవాబు చెప్పలేదు. కాని ఒక దృఢమైన నిశ్చయం నా మనస్సులో ఏర్పడింది; మా గురుదేవుల పాదసన్నిధిలో నేను తెలుసుకున్న ముక్తిప్రదమైన సత్యాల్ని నేను, నా శక్తిమేరకు, తోటివాళ్ళకు తెలియజెబుతాను. భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాను:

“ఈశ్వరా, నా భక్తి అనే గర్భగుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించనియ్యి. అన్ని హృదయాల్లోనూ నీ ప్రేమను నేను రగుల్కొలపగలిగేలా చెయ్యి”

ఇదివరలో ఒకసారి, నేను సన్యాసం తీసుకోకముందు, శ్రీయుక్తేశ్వర్‌గారు నే నెన్నడూ ఆశించని విధంగా వ్యాఖ్యానించారు.

“నీ ముసలితనంలో, భార్య సాంగత్యంలేని లోటు ఎంత ఉంటుందో నీకు!” అన్నా రాయన. “తన భార్యాబిడ్డల్ని పోషించడానికి, ఉపయోగపడే పనిలో ఉన్నవాడు దేవుడి దృష్టిలో, మెచ్చుకోదగ్గ పాత్ర నిర్వహిస్తున్నట్టేనని ఒప్పుకుంటావా?”

ఆ మాటలకు నేను భయకంపితుణ్ణి అయి, “గురుదేవా, ఈ జన్మలో నాకున్న కోరికల్లా ఆ విశ్వప్రియుడి కోసమేనని మీకు తెలుసు, అంటూ ఆక్షేపణ తెలిపాను.

గురుదేవులు వినోదంగా నవ్వారు; దాన్నిబట్టి ఆయన ఆ మాటలు కేవలం నన్ను పరీక్షించడానికే అన్నారని గ్రహించాను.

“ఇదుగో, మామూలు సంసార విధుల్ని విడిచిపెట్టేవాడు, అంత కన్న బాగా పెద్ద సంసారానికి సంబంధించిన ఏదో ఒక రకం బాధ్యత చేపడితేనే తప్ప, తను చేసింది న్యాయమని నిరూపించుకోలేడు. ఈ మాట గుర్తుంచుకో,” అని చెప్పారు మెల్లిగా.