పుట:Oka-Yogi-Atmakatha.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 27

రాంచీలో

యోగవిద్యాలయ స్థాపన

“సంస్థాపరమైన పని అంటే నీకు కిట్టదేం?”

గురుదేవుల ప్రశ్న నన్ను కొద్దిగా చకితుణ్ణి చేసింది. సంస్థలనేవి “కందిరీగల పుట్టలు” అని ఆ రోజుల్లో నాకు దృఢమైన విశ్వాసం ఉండేదన్న సంగతి నిజమే.

“అది కేవలం, మెప్పుకు నోచుకోని శ్రమండి!” అన్నాను, సమాధానంగా. “నాయకుడు ఏ పని చేసినా, చెయ్యకపోయినా కూడా విమర్శకు గురి అవుతూ ఉంటాడు.”

“దివ్యమైన ‘చన్నా’ (పెరుగు) అంతా నీ కొక్కడికే దక్కాలనుకుంటున్నావా?” మా గురుదేవుల ఎదురు సవాలుకు వాడిచూపు ఒకటి తోడయింది. “ఉదార హృదయులైన గురువుల పరంపర ఒకటి, తమ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సంకల్పించి ఉండకపోతే, నువ్వుకాని మరొకరుకాని, యోగంద్వారా దైవానుసంధానం సాధించగలరా?” అంటూ ఇంకా ఇలా అన్నారు. “దేవుడు తేనె అయితే సంస్థలు తేనెపట్లు; రెండూ అవసరమే. ఆత్మ లేనిదే ఏ రూపమైనా వ్యర్థమే; అయినా నువ్వు, ఆధ్యాత్మికామృతంతో నిండి ఉండే చురుకయిన తేనెపట్లు ఎందుకు ఏర్పాటు చెయ్యగూడదు”