పుట:Oka-Yogi-Atmakatha.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

435

మందిరాల్లో నెలకొని ఉన్న అధిచేతన శక్తులతో మనస్సును ఐక్యంచేసి, దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలో బతుకుతాడు; ప్రారబ్ధ ప్రభావోద్రేకాలవల్లకాని, మానవ అవివేకమూలకమైన నూతన ప్రేరణలవల్ల కాని ప్రేరితుడు కాడతడు. సర్వోత్తమ ఆకాంక్షను సఫలీకృతం కావించుకొని అతడు, అక్షయానందమయుడైన పరమాత్మ చరమాశ్రయంలో సుక్షేమంగా ఉంటాడు.

యోగవిద్యకున్న అమోఘ, క్రమానుగత సాఫల్యశక్తిగురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు, దాన్ని శాస్త్రోక్తంగా సాధన చేసిన యోగిని ఈ విధంగా ప్రశంసిస్తాడు:

“శారీరక క్రమశిక్షణ సాధనచేసే తపస్వుల కన్న గొప్పవాడు యోగి; జ్ఞానమార్గాన్నికాని, కర్మమార్గాన్నికాని అనుసరించే వాళ్ళకన్న కూడా గొప్పవాడు; కాబట్టి, ఓ శిష్యా! అర్జునా! నువ్వు యోగివి అవు!”[1]

  1. [తపస్విభ్యో౽ధికో యోగీ, జ్ఞానిభ్యో౽పి మతో౽ధికః
    కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున.]
                                                     - భగవద్గీత 4 : 46

    శ్వాసించకపోవడంవల్ల శరీరంమీదా మనస్సుమీదా పడే అసాధారణమైన, నూతన శక్తిదాయకమైన ప్రభావాల్ని కనిపెట్టడం, ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తోంది. న్యూయార్కులో ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్‌లో పనిచేసే డా॥ ఆల్వన్ ఎల్. బరాచ్ శ్వాసకోశాలకు స్థానికంగా విశ్రాంతి నిచ్చే వైద్యపద్ధతి ఒకటి రూపొందించాడు; దీనివల్ల క్షయరోగ పీడితులు చాలామందికి ఆరోగ్యం చేకూరుతోంది. ఊపిరి ఒత్తిడిని సరిసమానం చేసే గది (ఈక్వలైజింగ్ ప్రెషర్ ఛాంబర్ ) ని ఉపయోగించడంవల్ల రోగి ఊపిరి తీసుకోడం, ఆపెయ్యగలుగుతున్నాడు. 1947 ఫిబ్రవరి 1 తేదీ నాటి,

    “న్యూయార్క్ టైమ్స్” పత్రికలో, డా॥ బరాచ్ చెప్పినది. ఇలా పేర్కొన్నారు: “శ్వాస ఆగిపోవడంవల్ల కేంద్ర నాడీవ్యవస్థ మీద కలిగే ప్రభావం చాలా ఆసక్తికరమైనది. శరీరం చివరి భాగాల్లో ఉండే స్వయంపాలకమైన కండరాల్ని కదపాలన్న కోరిక చాలా తగ్గిపోతుంది. చేతులు కదపకుండాను, భంగిమ మార్చకుండాను కూడా రోగి, గంటల తరబడి ఆ గదిలో పడుకొని ఉండవచ్చు. స్వయంప్రేరితమైన శ్వాసక్రియ ఆగిపోయినప్పుడు రోగికి, పొగ తాగాలన్న కోరిక మాయమవుతుంది; రోజుకు రెండేసి పెట్టెల సిగరెట్లు కాల్చే అలవాటున్న వాళ్ళకు కూడా ఆ కోరిక పుట్టదు. అనేక సందర్భాల్లో, అటువంటి స్థితిలో కలిగే విశ్రాంతి ఏ విధంగా ఉంటుందంటే, రోగికి మనస్సును రంజింపజేసేవి ఏవీ అవసరం కావు. ఈ వైద్యం విలువను బహిరంగంగా రూఢిచేస్తూ డా. బరాచ్, 1951 లో ఇలా అన్నాడు, “ఇది ఊపిరితిత్తులకు మాత్రమే కాక , శరీరమంతకూ విశ్రాంతి ఇస్తుంది. మనస్సు విషయంలో ఇది మరీ స్పష్టం, మాట వరసకి, గుండె చేసే పనిలో మూడోవంతు తగ్గిపోతుంది. రోగులు ఆందోళన పడడం మానేస్తారు. ఎవరికి విసుగు పుట్టదు.”

    ఈ యథార్థాల్నిబట్టి యోగులకు, మానసికంగాగాని శారీరకంగాగాని నిర్విరామ కార్యకలాపాలు జరపాలన్న అభిలాషలేకుండా సుదీర్ఘకాలాలు నిశ్చలంగా కూర్చోడం ఎలా సాధ్యమవుతుందో గ్రహించడం మొదలుపెడతారు. అటువంటి ప్రశాంత స్థితిలో మాత్రమే ఆత్మ, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళేదారి కనుక్కుంటుంది. శ్వాసించకపోవడంవల్ల నిర్దిష్టమైన కొన్ని లాభాలు పొందడానికి, మామూలు మనిషికయితే ఈక్వలైజింగ్ ప్రెషర్ చాంబర్ తప్పకుండా ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ, యోగికి మాత్రం, శారీరకంగానూ మాససికంగానూ ఆత్మజ్ఞానపరంగానూ లాభాలు పొందడానికి, క్రియాయోగం తప్ప మరేమీ అక్కరలేదు.