పుట:Oka-Yogi-Atmakatha.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

433

తోనూ, ఆహ్లాదకరమైన ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అతనికి పదికి మరో పది లక్షల ఏళ్ళు కలిపినా కూడా విముక్తి సాధించడానికి వ్యవధి చాలదు.

సంస్కారంలేని మనిషి, తన శరీరం ఒక రాజ్యమనీ ఆత్మ అనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడనీ, కపాల సింహాసనాన్ని ఆయన అధిష్టించి ఉండగా షట్చక్రాలనే సామంత రాజుప్రముఖులు ఆయన దగ్గర కొలువై ఉంటారనీ- అంటే చైతన్య మండలాలు ఆయన్ని పరివేష్ఠించి ఉంటాయనీ - గ్రహించడం అరుదూ కావచ్చు; గ్రహించకనే పోవచ్చు. ఈ దైవరాజ్య వ్యవస్థకు విధేయులైన పౌరులు అనేకమంది ఉన్నారు; ఇరవైఏడువేల లక్షల కోట్ల కణాలు (ఇవి స్వయంచాలితంగా భాసిస్తున్నప్పటికీ నిస్సందేహంగా ప్రజ్ఞ కలిగి, శారీరకమైన వృద్ధి, రూపాంతరణ, క్షయాలనే విధులన్నీ నిర్వర్తిస్తూ ఉండేవి), ఐదుకోట్ల అంతస్తరీయ ఆలోచనలూ, భావోద్రేకాలూ, అరవైఏళ్ళ సగటు జీవితంలో మానవుడి చైతన్యంలో, పాటూపోట్ల మాదిరిగా మారుతూ వచ్చే వివిధావస్థలూనూ.

ఆత్మసమ్రాట్టుకు వ్యతిరేకంగా, మానవదేహంలోనయినా మనస్సులోనయినా, వ్యాధిరూపంలోగాని అవివేకరూపంలోగాని వ్యక్తమయే ప్రత్యక్షమైన తిరుగుబాటుకు కారణం, ఆయనకు విధేయులైన పౌరులు తలపెట్టే రాజద్రోహం కాదు; మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్రేచ్ఛను, పూర్వమో, ప్రస్తుతమో దుర్వినియోగం చెయ్యడమే. ఆ స్వతంత్రేచ్ఛ అతనికి ఆత్మతోబాటు ఇచ్చినదే; అంతేకాదు, ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోడానికి వీలులేకుండా ఇచ్చినదే.

మానవుడు తుచ్ఛమైన అహంకారంతో మమైకమై, ఆలోచనలు చేసేవాడూ, సంకల్పించేవాడూ, అనుభూతిపొందేవాడూ, అన్నం జీర్ణం చేసేవాడూ, తనను సజీవంగా ఉంచేవాడూ తానేనని అనుకుంటూ