పుట:Oka-Yogi-Atmakatha.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

427

సార్ల చొప్పున, పధ్నాలుగు మొదలు ఇరవైనాలుగుసార్లవరకు మత్రమే యోగసాధన చేస్తాడు. కొందరు యోగులు ఆరేళ్ళలోకాని, పన్నెండేళ్ళలో కాని, ఇరవైనాలుగేళ్ళలో కాని, నలభై ఎనిమిదేళ్ళలోకాని విముక్తి సాధిస్తారు. ఒక వేళ, ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించక ముందే చనిపోయినట్లయితే, వెనకటి క్రియాసాధన బాపతు సత్కర్మను తనవెంట తీసుకుపోతాడు; కొత్త జన్మలో అతడు స్వాభావికంగానే అంతిమ లక్ష్యం వేపు ఆకృష్టుడవుతాడు.

సగటు మనిషి శరీరం ఏభై వాట్ల కరెంటు బల్బులాంటిది; ఆ శరీరం, అత్యధిక క్రియాసాధనవల్ల ఉత్పన్నమయే లక్షకోట్ల వాట్ల శక్తిని ఇముడ్చుకోలేదు. సులభంగాను, నిర్దుష్టంగాను ఉండే క్రియాయోగ పద్ధతుల్ని క్రమక్రమంగా, నియమానుసారంగా పెంచుతూ సాధన చెయ్యడంవల్ల, మనిషి శరీరం రోజురోజుకూ సూక్ష్మరూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది; చివరికది పరమాత్ముడి, ప్రథమ భౌతిక, క్రియాశీలక అభివ్యక్తి అయిన విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాల్ని అభివ్యక్తం చెయ్యడానికి తగి ఉంటుంది.

క్రియాయోగానికీ, తప్పుదారి పట్టిన ఉత్సాహవంతులు కొందరు నేర్పే అశాస్త్రీయమైన శ్వాసనియంత్రణాభ్యాసాలకీ ఎంత మాత్రం పోలిక లేదు. ఊపిరిని బలవంతంగా ఊపిరితిత్తుల్లో బిగబట్టి ఉంచడం అసహజమే కాకుండా, నిస్సందేహంగా అసౌఖ్యమయింది కూడా. కాని క్రియాసాధనలో అలా కాకుండా, మొదటినించి కూడా ప్రశాంతతానుభూతులు కలుగుతాయి; అంతేకాక, వెనుబాములో పునరుత్పాదక ఫలితాన్నిచ్చే ఉపశమకారక సంవేదనలు కూడా తోడయి ఉంటాయి.

ఈ సనాతన యోగ ప్రక్రియ శ్వాసను మనో ద్రవ్యంగా మార్చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా ఎవరయినా, శ్వాసను ఒక మనో