పుట:Oka-Yogi-Atmakatha.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

424

ఒక యోగి ఆత్మకథ

పతంజలి రెండోసారి ఇలా ప్రస్తావించాడు: “ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామంవల్ల ముక్తి సాధించవచ్చు. [1]

సెంట్ పాల్‌కు క్రియాయోగం, లేదా ఆ మాదిరి మరో ప్రక్రియ తెలుసు; దాని ద్వారా ఆయన, ప్రాణశక్తి ప్రవాహాల్ని ఇంద్రియాల్లోకి వదలడంకాని, ఆపడంకాని చెయ్యగలుగుతూండేవాడు. అంచేతే ఆయన ఇలా అనగలిగాడు: “క్రీస్తంటే మనకున్న పరమానందం మీద ఒట్టు వేసి చెబుతున్నాను, నేను రోజూ చనిపోతుంటాను.[2] సెంట్ పాల్ (సాధారణంగా ఇంద్రియ జగత్తువేపు సాగుతూ, తద్ద్వారా సత్యమనే అభాస దానికి కల్పిస్తూ ఉండే) తన శారీరక ప్రాణశక్తిని ఒకానొక ప్రక్రియ ద్వారా అంతర్ముఖంగా కేంద్రీకరింపజేసి ప్రతి రోజూ కూటస్థ చైతన్యం (క్రీస్తు చైతన్యం) లో మునిగి ఆనందిస్తూ యోగపరమైన నిజమైన తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ ఆనందావస్థలో, మాయాప్రపంచపు ఇంద్రియ భ్రాంతులకు సంబంధించినంతవరకు, తాను “చచ్చినవాడి” కిందే జమ అనీ, లేదా వాటినుంచి విముక్తుణ్ణి అయాననీ ఆయనకు స్పృహలో ఉండేది.

దైవసంపర్కపు (సవికల్ప సమాధి) ఆరంభస్థితుల్లో భక్తుడి చైతన్యం ‘విశ్వాత్మ’లో విలీనమవుతుంది; అతని ప్రాణశక్తిని శరీరంలోంచి లాగేసినట్టు అవుతుంది, అప్పుడా శరీరం “చచ్చిపోయి” నట్టుగా కదలిక లేకుండానూ బిర్రబిగిసి ఉన్నట్టు కనిపిస్తుంది. తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానన్న స్పృహ, యోగికి పూర్తిగా ఉంటుంది. అయితే, ఉన్నత స్థితులకు (నిర్వికల్ప సమాధి) పురోగ

  1. [తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయో ర్గతివిచ్చేదః. ప్రాణాయామః] -యోగ సూత్రాలు : : 49.
  2. కోరింథియన్లు 15 : 31 (బైబిలు),