పుట:Oka-Yogi-Atmakatha.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు

25

పోయాను; ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది. నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్ళు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గ ద్వారాల్ని భేదించి చివరికి ఆ జగజ్జననినే పిలుచుకువచ్చాయి. నా పచ్చిపుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే:

“జన్మజన్మలుగా, అనేకమంది తల్లుల వాత్సల్యరూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను! నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను, రెండింటినీ నా చూపులో చూడు!”

ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేనూ నాన్నగారూ బెరైలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ - బంగారు వన్నెలో మిసిమిచెందే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద ‘సేవాలి’ వృక్షం. నేను ప్రతిరోజూ పొద్దున విచారగ్రస్తుడినయి ఆ చెట్టు దగ్గిరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది. తెల్లటి ఆ ‘సేవాలి’ పుష్పాలు, పచ్చని గడ్డితో నిండిన గద్దెమీద, మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని. నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా, ఉషస్సులోంచి బయల్వెడలుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని, తరచు గమనిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుడికోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కొంటున్నట్టు అనిపించేది.

ఒకసారి, మా చుట్టం ఒకాయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత