పుట:Oka-Yogi-Atmakatha.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నయ్య అనంతుడు, చెల్లెలు నళిని

417

నేను ఆనందంగా ఒక నిట్టూర్పు విడిచి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను.

“స్వామీ, మీరు దేశికచక్రవర్తులు; ఆమె కోలుకుంటుందని మీరన్నమాట ఒక్కటి చాలు. కాని, మీరు కాదూ కూడదంటే మాత్రం ఒక ముత్యం సంపాయించి ఇస్తాను.”

గురుదేవులు తల ఆడించారు. “ఔను. అలాగే చెయ్యి.” ఆయన నళినిని ఎన్నడూ చూసినవారు కారు; కాని ఆమె శారీరక, మానసిక లక్షణాలు సరిగ్గా వర్ణించి చెప్పారు.

“స్వామీ, ఇది జ్యోతిష సంబంధమైన పరిశీలనా? ఆమె పుట్టిన రోజుకాని, సమయం కాని మీకు తెలియదే!”

శ్రీయుక్తేశ్వర్‌గారు చిరునవ్వు నవ్వారు. “అంతకన్న లోతయిన జ్యోతిషం ఉంది; పంచాంగాలూ గడియారాలూ చెప్పే సాక్ష్యం మీద ఆధారపడదది. ప్రతి మనిషీ సృష్టికర్త లేదా విరాట్ పురుషుడి అంశ; అతనికి సూక్ష్మశరీరం ఒకటీ స్థూలశరీరం ఒకటీ ఉంటాయి. మానవ నేత్రం భౌతికరూపాన్నే చూస్తుంది, కాని అంతశ్చక్షువు మరింత గాఢంగా చొచ్చుకుపోతుంది. ప్రతి మనిషీ ఒక అంతర్భాగంగానూ ప్రత్యేక వ్యక్తిగానూ ఏర్పడిఉన్న బ్రహ్మాండ స్వరూపంలోకి కూడా చొచ్చుకు పోయి చూస్తుంది.

నేను కలకత్తాకు తిరిగివచ్చి నళినికోసం ఒక ముత్యం[1] కొన్నాను.

  1. ముత్యాలూ రత్నాలూ లోహాలూ కొన్ని ఓషధులు మనిషి ఒంటికి తగిలి ఉన్నట్లయితే, అవి - శరీర కణాలమీద విద్యుదయస్కాంత ప్రభావం చూపిస్తాయి. కొన్ని మొక్కల్లోనూ, లోహాల్లోనూ రత్నాల్లోనూ కూడా ఉండే కర్బనమూ ఇతర లోహమూలకాలూ మానవశరీరంలోనూ ఉన్నాయి. ఈ విషయాల్లో ఋషులు కనిపెట్టినవాటిని, ఎప్పుడో ఒకనాడు, శరీరశాస్త్రవేత్తలు కూడా ధ్రువపరుస్తారు. విద్యుత్ ప్రాణప్రవాహంతో, సంవేదనశీలకమైన మానవ శరీరం, ఈనాటికీ అన్వేషించని అనేక రహస్యాలకు కేంద్రం.

    రత్నాలకూ లోహపు కడియాలకూ శరీరంలోని రోగాల్ని నయంచేసే విలువ ఉన్నప్పటికీ, శ్రీయుక్తేశ్వర్‌గారు వాటిని సిఫార్సు చెయ్యడానికి మరో కారణం కూడా లేకపోలేదు. సద్గురువులు తాము రోగనివారకులుగా కనిపించాలని ఆశించరు; దేవుడే రోగనివారకుడు. అంచేత సాధువులు, ఈశ్వరుడి దగ్గర్నించి తాము సవినయంగా అందుకున్న శక్తుల్ని తరచు, రకరకాల ముసుగుల్లో మరుగు పరుస్తారు. సాధారణంగా మానవుడు, ప్రత్యక్ష వస్తువులమీదే విశ్వాసం పెట్టుకుంటాడు; రోగం నయం కావడానికని మా గురుదేవుల దగ్గరికి ఎవరయినా వచ్చినప్పుడు, ఆయన వాళ్ళకి దండకడియం వేసుకోమనో, రత్నం ధరించమనో సలహా ఇస్తూండేవారు; వాళ్ళలో విశ్వాసం రగుల్కొల్పడానికి, వాళ్ళ దృష్టిని తమ మీంచి మళ్ళించడానికి అలా చేస్తూ ఉండేవారు. కడియాలకూ రత్నాలకూ విద్యుదయస్కాంత సంబంధమైన రోగనివారక శక్తులు అంతర్గతంగా ఉన్నప్పటికీ, వాటితోబాటు గురుదేవుల గుప్తమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కూడా కలిసి ఉండేవి.