పుట:Oka-Yogi-Atmakatha.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

416

ఒక యోగి ఆత్మకథ

చేశాను. నాతో పూర్తిగా సహకరించే ఆంగ్లో ఇండియన్ నర్సు నొకామెను ఏర్పాటుచేసి, రకరకాల యోగచికిత్సా పద్ధతులు మా చెల్లిమీద ప్రయోగించాను. నెత్తురు విరేచనాలు కట్టేశాయి.

కాని డా॥ బోసు విచారగ్రస్తంగా తల ఆడించారు. “పోవడాని కింక ఆమెలో రక్తమే లేదు.”

“తప్పకుండా కోలుకుంటుంది,” అన్నాను, దృఢంగా జవాబిస్తూ. “ఏడు రోజుల్లో తన జ్వరం తగ్గిపోతుంది.”

ఒక వారం తిరిగేసరికి నళిని కళ్ళువిప్పి, ఆప్యాయంగా గుర్తుపట్టి నా వేపు చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకించింది. ఆ రోజు మొదలు తను త్వరత్వరగా కోలుకుంది. తన మామూలు బరువు తనకి వచ్చినప్పటికీ, దాదాపు ప్రాణాంతకమైన ఆ జబ్బు కలిగించిన హానికి బాధాకరమైన గుర్తుగా, కాళ్ళు పడిపోయాయి. వైద్యనిపుణులయిన భారతీయులూ, ఇంగ్లీషువాళ్ళూ కూడా ఆమెను, ఆశ వదులుకోవలసిన అవిటి దానికింద తేల్చి చెప్పేశారు.

ఆమె ప్రాణంకోసం, ప్రార్థన ద్వారా నిర్విరామంగా నేను సాగించిన యుద్ధం, నన్ను బాగా నీరసపెట్టేసింది. శ్రీయుక్తేశ్వర్‌గారి సహాయం కోసం నేను శ్రీరాంపూర్ వెళ్ళాను. నళిని దుస్థితి చెప్పేసరికి ఆయన గాఢంగా సానుభూతి ప్రకటించారు.

“ఒక్క నెల గడిచేసరికి మీ చెల్లాయి కాళ్ళు మామూలుగా అవుతాయి,” అంటూ ఆయన, “చిల్లు చెయ్యని, రెండు క్యారెట్ల ముత్యం ఒకటి సంపాదించి దాన్ని ఒక కొలికికి అమిర్చి, చర్మానికి తగిలేటట్టుగా ఒక పట్టీతో కట్టుకోమను.”