పుట:Oka-Yogi-Atmakatha.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నయ్య అనంతుడు, చెల్లెలు నళిని

415

ఆశీస్సుల ద్వారా, ఈ రోజునుంచి నీ శరీరం నిజంగా మార్పు చెందుతుంది. ఒక్క నెల్లాళ్ళలో, నాకున్నంత బరువు రావాలి నీ శరీరానికి.”

నా గుండెలోంచి వెలువడ్డ ఈ మాటలు నిజమయాయి. ఒక్క ముప్ఫై రోజులకల్లా, నళిని బరువు నా బరువుతో సమానమయింది. కొత్తగా వచ్చిన గుండ్రతనంతో ఆమెకు మంచి అందం వచ్చింది. దాంతో వాళ్ళాయన ఆమెను గాఢంగా ప్రేమించాడు. అమంగళంతో ఆరంభమయిన వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా చెప్పుకోదగ్గంత హాయిగా పరిణమించింది.

నేను దేశంలో లేనప్పుడు నళినికి సన్నిపాతజ్వరం (టైఫాయిడ్) వచ్చిందని, నేను జపానునుంచి తిరిగి రాగానే తెలిసింది. హుటాహుటిని వాళ్ళింటికి ఉరికి సన్నగా పుల్లలా అయిపోయిన నళినిని చూసి కొయ్యబారి పోయాను. ఆమె అపస్మారకంలో ఉంది.

“ఈ జబ్బువల్ల మీ చెల్లాయి మనస్సు కలతచెందకముందు ‘ముకుందన్నయ్య ఉండి ఉంటే నాకిలా అయేది కాదు,’ అంటూండేది తరచు,” అన్నారు మా బావగారు. “డాక్టర్లకి నాకూ రవ్వంత ఆశకూడా కనిపించడం లేదు. టైఫాయిడ్‌తో అన్నాళ్ళు బాధపడింది చాలక, ఇప్పుడు నెత్తురు విరేచనాలు మొదలయాయి,” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు ఆయన.

నా ప్రార్థనలతో భూమ్యాకాశాలు దద్దరిల్లేటంతగా విశ్వప్రయత్నం