పుట:Oka-Yogi-Atmakatha.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నయ్య అనంతుడు, చెల్లెలు నళిని

413

మాంసం, గుడ్లు, టానిక్కులు. అయినా, అంగుళంలో నూరోవంతు కూడా ఒళ్ళు చెయ్యలేదు ఈవిడ.”

కొన్నాళ్ళ తరవాత నేను బోసుగారింటికి వెళ్ళాను. అక్కడ నా పనికి ఐదు నిమిషాలే పట్టింది. నేను తిరిగి వచ్చేస్తున్నాను, నళిని చూడ్డం లేదనే అనుకున్నాను. నేను వీధిగుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది; ఆప్యాయంగానే ఉన్నా, ఆజ్ఞాపిస్తున్నట్టు ఉందది.

“అన్నయ్యా, ఇలా రా. ఈసారి నన్ను తప్పించుకుపోలేవు. నీతో మాట్లాడాలనుకుంటున్నాను.”

నేను మెట్లెక్కి తన గదికి వెళ్ళాను. తను కళ్ళు తడుపుకోడం చూసి ఆశ్చర్యపోయాను.

“అన్నయ్యా, మన పాత కోపతాపాలన్నీ మరిచిపోదాం. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికమార్గంలో నిలదొక్కుకున్నావు. నేను కూడా అన్ని విధాలా నీలా కావాలనుకుంటున్నా,” అని చెప్పి, కొంచెం ఆశగా ఇలా అంది: “నువ్విప్పుడు పుష్టిగా కనిపిస్తున్నావు. నాకు కాస్త సాయం చెయ్యవూ? మా ఆయన నా దరిదాపులకే రావటం లేదు; నేను ఆయన కోసం ఎంత ఇదయితే ఏం లాభం? నేనిలా సన్నగా, ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ, దైవసాక్షాత్కార సాధనలో మాత్రం ముందుకు పోవాలన్నదే నా ముఖ్యమైన కోరిక.”

ఆమె విన్నపం నా గుండెను కరిగించింది. మా కొత్త స్నేహం నిలకడగా పెరిగింది. ఒకనాడు తను నాకు శిష్యురాలినవుతా నన్నది.

“నువ్వెలా అనుకుంటే అలా తర్ఫీదు ఇయ్యి నాకు. టానిక్కుల మీదకన్న దేవుడిమీదే నమ్మక ముంచుతాను.” మందు సీసాలన్నీ పోగుచేసి కిటికీలోంచి బయటి కుళ్ళుకాలవలోకి విసిరి పారేసింది.