పుట:Oka-Yogi-Atmakatha.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను సన్యాసం తీసుకోడం

401

లేనివీ; కనక, మనస్సును అదుపులోపెట్టే యోగశాస్త్రం ఆవశ్యకత సుస్పష్టమవుతోంది.

సనాతన ఋషిపుంగవుడు పతంజలి,[1] యోగశాస్త్రాన్ని నిర్వచిస్తూ “ఒకటి విడిచి ఒకటి చొప్పున చైతన్యంలో లేచే తరంగాల్ని శమింప జేయడం”అన్నాడు.[2] ‘యోగసూత్రాలు’ అనే పేరుతో ఆయన సంగ్రహంగా రాసిన మహాగ్రంథం హిందూషడ్దర్శనాల్లో ఒకటి. పాశ్చాత్య తత్త్వశాస్త్రాలకు భిన్నంగా, హిందూ షడ్దర్శనాల్లో, కేవలం సిద్ధాంతపరమైన బోధలే కాకుండా ఆచరణ సాధ్యమైనవి కూడా పొందుపరిచి ఉన్నాయి.

  1. పతంజలి క్రీ. పూ. రెండో శతాబ్దివాడని చాలామంది విద్వాంసులు అంటున్నప్పటికీ ఆయన కాలం కచ్చితంగా తెలియకుండానే ఉంది. ఋషులు బహుసంఖ్యాకమైన విషయాలెన్నిటిగురించో గ్రంథాలు రాశారు; వారి అంతర్దృష్టి ఎంత గాఢమంటే, ఎన్ని యుగాలకయినా సరే, వాటికి కాలదోషం పట్టించగల శక్తి లేదు; అయినప్పటికీ ఆ ఋషులు తమ గ్రంథాల్లో తమ జీవితకాలాల్ని పేర్కొనడానికి కాని, తమ మూర్తిమత్వాల ముద్రలు వాటిమీద వెయ్యడానికి కాని ఏమీ ప్రయత్నించకపోవడంతో తరవాతి చారిత్రకులకు విభ్రాంతి కలిగింది. తమ స్వల్ప జీవితకాలాలు అనంత జీవితంలో మెరిసే మెరుపుల్లా తాత్కాలిక ప్రాముఖ్యం కలిగినవేనని, సత్యం కాలాతీతమని, దానిమీద వ్యాపారముద్ర వెయ్యడం అసాధ్యమని, అదేమీ తమ సొంత ఆస్తి కాదని వారికి తెలుసు.
  2. “యోగశ్చిత్తవృత్తినిరోధః” (యోగసూత్రాలు 1:2) అన్నదాన్ని “మనోభావ వికారాల నిలుపుదల” అని కూడా అనువదించవచ్చు. చింతన శీలతను సూచించే సమగ్ర పదం ‘చిత్తం’; ప్రాణశక్తులు, మానస సత్త (మనస్సు లేదా ఇంద్రియ స్పృహ), అహంకారం (నేను, నాది అనే భావం), బుద్ధి (సహజావబోధాత్మకమైన జ్ఞానం) ఇందులోకి వస్తాయి. ‘వృత్తి’ (దీనికి వాచ్యార్థం, “సుడిగుండం”) అనేది, మానవుడి చైతన్యంలో నిరంతరం పైకి లేస్తూ కిందికి పడుతూ ఉండే ఆలోచన, ఆవేశతరంగాల్ని సూచిస్తుంది. ‘నిరోధ’ మంటే శమింప జేయడం, నిలుపుదల, అదుపులో ఉంచడం అని అర్థం.