పుట:Oka-Yogi-Atmakatha.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

388

ఒక యోగి ఆత్మకథ

సంధ్యల మీద ఇంత హఠాత్తుగా ఆసక్తి పుట్టుకొచ్చిందేం నాయనా? చివరి క్షణంలో ఇలా గోలపెట్టడం దేనికి? కాని పరీక్ష పాసవడానికి రావలసిన మార్కు ఇప్పుడే 33 కు తగ్గించడం మాత్రం నిజం,” అన్నాడతను.

ఆనందంగా నాలుగు ఉరుకుల్లో నా గదిలోకి వచ్చి పడ్డాను. మోకాళ్ళ మీదికి వాలి, ఆ పరమేశ్వరుడి గణితశాస్త్ర పరిపూర్ణతలకు జోహారు లర్పించాను.

రమేశ్ ద్వారా నాకు దారి చూపిస్తున్నట్టు స్పష్టంగా అనుభూతమవుతున్న ఒకానొక ఆధ్యాత్మిక శక్తి ఉనికి స్పృహలో ఉండడంతో ప్రతి రోజు నేను ఆనందంతో పులకితుణ్ణయాను. బెంగాలీ భాష కోర్సుకు సంబంధించిన పరీక్ష విషయంలో చెప్పుకోదగ్గ సంఘటన ఒకటి జరిగింది. ఒకనాడు పొద్దున, ఆ కోర్సులో నాకు చదువుచెప్పిన రమేశ్, పరీక్ష హాలుకు వెళ్ళడానికి బోర్డింగ్ హౌస్ నుంచి బయలుదేరుతూ ఉండగా నన్ను పిలిచాడు.

“రమేశ్ నీ కోసం అరుస్తున్నాడు,” అన్నాడొక క్లాస్‌మేటు చిరాకుగా. “వెనక్కి వెళ్ళకు; పరీక్ష హాలుకు వెళ్ళడానికి ఆలస్యమయిపోతుంది.”

అతని సలహా పట్టించుకోకుండా, బోర్డింగ్ హౌస్‌కు పరిగెత్తాను.

“మామూలుగా మన బెంగాలీ కుర్రాళ్ళు బెంగాలీ పరీక్షలో సులువుగా పాసయిపోతారు,” అన్నాడు రమేశ్ . “కాని ఈ ఏడాది ప్రొఫెసర్లు, పాఠ్యపుస్తకాలమీద ప్రశ్నలడిగి విద్యార్థుల్ని “ఊచకోత” కొయ్యాలని ఎత్తు వేసినట్టుగా ఇప్పుడే నా మనస్సుకు తట్టింది.” ఆ తరవాత అతను, పందొమ్మిదో శతాబ్దం తొలికాలంలో ప్రసిద్ధుడైన విద్యాసాగర్ అనే బెంగాలీ ప్రజాహితకారుడి జీవితంలోంచి రెండు కథలు టూకీగా చెప్పాడు.