పుట:Oka-Yogi-Atmakatha.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వవిద్యాలయపట్టప్రాప్తి

387

మార్కులు 33-పాస్ కావడానికి రావలసిన 36 మార్కులకన్న మూడు మార్కులు తక్కువ.

వెంటనే గురుదేవుల దగ్గరికి పరిగెత్తి, నా బాధలు వెళ్ళబోసుకున్నాను.

“గురుదేవా, నేను క్షమించరాని తప్పు చేశాను. రమేశ్ ద్వారా దేవుడి ఆశీస్సులు పొందడానికి నేను అర్హుణ్ణి కాను; నేను పూర్తిగా పనికి మాలినవాణ్ణి.”

“హుషారుగా ఉండు, ముకుందా,” అన్నారు గురుదేవులు. శ్రీయుక్తేశ్వర్‌గారి స్వరంలో మార్దవం, నిశ్చింత కనిపిస్తున్నాయి. ఆయన నీలాకాశం వేపు వేలు చూపించారు. “అంతరిక్షంలో సూర్యచంద్రులు తమ స్థానాలు మార్చుకోడమయినా జరగొచ్చుకాని, డిగ్రీ సంపాదించడంలో నువ్వు ఫెయిల్ కావడం జరగదు!”

ప్రశాంత మనఃస్థితిలో నేను ఆశ్రమంనుంచి బయటికి వచ్చాను; అయితే నేను పాస్ కాగలగడం గణితశాస్త్రీయంగా అనూహ్యంగానే కనిపిస్తోంది. ఒకటి రెండుసార్లు బెదురుబెదురుగా ఆకాశంలోకి చూశాను. దినరాజు తన మామూలు కక్ష్యలో సురక్షితంగానే కనిపించాడు.

నేను ‘పాంథీ’ చేరేసరికి, మా సహాధ్యాయి ఒకడు అన్న మాట నా చెవిని పడింది: “ఇంగ్లీషు సాహిత్యంలో పాస్ కావడానికి రావలసిన మార్కు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తగ్గించారని నా కిప్పుడే తెలిసింది.”

నేను ఆ అబ్బాయి గదిలోకి జోరుగా పరిగెత్తేసరికి, అతను కంగారుపడిపోతూ చూశాడు. నే నతన్ని ఆత్రంగా ప్రశ్నించాను.

“జెడదారి సన్యాసి,” అని నన్ను చూసి నవ్వుతూ, “చదువు