పుట:Oka-Yogi-Atmakatha.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వవిద్యాలయపట్టప్రాప్తి

383

దగ్గరే గడిచిపోయాయని మీకు తెలుసు. అలాంటప్పుడు, ఆ కఠినమైన పరీక్షలకి వెళ్ళి నాటకం ఆడడానికి నే నెలా సిద్ధపడతాను?” అంటూ అభ్యంతరం చెప్పాను.

శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళు నా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూశాయి. “నువ్వు వెళ్ళి తీరవలసిందే.” ఆయన కంఠస్వరం నిష్ఠురంగా, అనుల్లంఘనీయమైన శాసనంలా ధ్వనించింది. “మీ నాన్న గారికీ తక్కిన చుట్టాలకీ, ఆశ్రమజీవితానికి నువ్విచ్చే ప్రాముఖ్యాన్ని విమర్శించడానికి మనం కారణం కల్పించగూడదు. నువ్వు పరీక్షలకి హాజరవుతానని నాకు మాట ఇయ్యి చాలు; నువ్వు రాయగలిగినంత బాగా సమాధానాలు రాయి.”

కన్నీళ్ళు, ఆపుకోడానికి వీలుకాకుండా నా మొహం మీద ధారకట్టి కారుతున్నాయి. గురుదేవుల ఆజ్ఞ సబబుగా లేదనీ, ఆయన ఆసక్తిటూకీగా చెప్పాలంటే- కాలదోషం పట్టినటువంటిదనీ అనిపించింది నాకు.

“మీకు కావాలంటే నేను తప్పకుండా హాజరవుతాను” అన్నాను వెక్కి వెక్కి ఏడుస్తూ. “కాని సరిగా తయారుకావడానికి వ్యవధి లేదండి” అని చెబుతూ, “ప్రశ్నలకు రాయవలసిన సమాధానాల్లో, మీ ఉపదేశాలతోనే కాయితాలు నింపేస్తాను!” అని నాలో నేను గొణుక్కున్నాను.

ఆ మర్నాడు నేను మామూలు వేళకి ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు, నే నిచ్చే పూలగుత్తి విచార గ్రస్తుణ్ణయి శ్రీయుక్తేశ్వర్‌గారికి సమర్పించాను. నా విషాదరూపం చూసి నవ్వారాయన.

“ముకుందా, పరీక్షలోకానీ, మరోచోటకానీ దేవుడు నిన్నెప్పుడయినా తప్పించాడా?”

“లేదండి,” అన్నాను నేను ఉత్సాహంగా. కృతజ్ఞతాపూర్వకమైన స్మృతులు నాలో మళ్ళీ ఉత్సాహం కలిగిస్తూ వెల్లువలా పెల్లుబికాయి.