పుట:Oka-Yogi-Atmakatha.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

382

ఒక యోగి ఆత్మకథ

నేను గైర్హాజరయినప్పటి కంటె హాజరయినప్పుడే ఆశ్చర్యం ప్రకటించేవారు.

పొద్దున తొమ్మిదిన్నరకి సైకిలెక్కి బయల్దేరడంతోనే దాదాపు ప్రతిరోజూ నా దినచర్య మొదలయేది. ఒక చేత్తో, గురుదేవులకు అర్పించడానికి, మా ‘పాంథీ’ వసతిగృహంలోని తోటలో పూసిన పూలు కొన్ని పట్టుకువెళ్ళే వాణ్ణి. గురుదేవులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ మధ్యాహ్న భోజనానికి ఉండిపొమ్మనేవారు. ఇక ఆ రోజుకు కాలేజీకి వెళ్ళడమనే బెడద తప్పినందుకు సంతోషిస్తూ, ఆయన ఆహ్వానాన్ని తప్పకుండా హుషారుగా అంగీకరించేవాణ్ణి. శ్రీయుక్తేశ్వర్‌గారి సాటిలేని జ్ఞానోపదేశాలు ఆలకిస్తూనో, ఆశ్రమ విధుల్లో సాయపడుతూనో ఆయనతో గంటల తరబడి గడిపిన తరవాత, మనస్సు ఒప్పకపోయినా ఏ నడిరాత్రి వేళకో బయల్దేరి ‘పాంథీ’ వసతిగృహానికి వెళ్తూ ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు, రాత్రి అంతా గురుదేవుల దగ్గరే ఉండిపోయేవాణ్ణి; ఆనందంగా ఆయన సంభాషణలో ఎలా మునిగిపోయేవాణ్ణంటే, చీకటి వేకువగా మారిందెప్పుడో కూడా గమనించేవాణ్ణి కాదు.

ఒకనాడు రాత్రి పదకొండు గంటలవేళ నేను నా గదికి తిరుగు ప్రయాణం కట్టే ప్రయత్నంలో బూట్లు తొడుక్కుంటూ ఉండగా, గురుదేవులు గంభీరంగా ఇలా అడిగారు:

“నీ బి. ఏ. పరీక్ష లెప్పుడు మొదలవుతాయి?”

“ఇంక ఐదు రోజుల్లోనండి.”

“నువ్వు వాటికి తయారుగానే ఉన్నావనుకుంటాను.”

భయంతో కొయ్యబారిపోయి, ఒక బూటు గాలిలోకి ఎత్తి పట్టుకున్నాను. “గురుదేవా, ఇన్నాళ్ళూ నాకు అధ్యాపకుల దగ్గరకంటె మీ