పుట:Oka-Yogi-Atmakatha.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

380

ఒక యోగి ఆత్మకథ

తప్పిస్తాయని నమ్ముకున్నారు. నా తోటి విద్యార్థులు నా గురించి ఇచ్చిన తీర్పు, “పిచ్చి సన్యాసి” అని వాళ్ళు నాకు పెట్టిన మారుపేరులోనే వెల్లడి అయింది.

తత్త్వశాస్త్రంలో నేను తప్పుతానన్న ప్రొఫెసర్ ఘోషాల్‌గారి బెదిరింపును వమ్ముచెయ్యడానికి నేను తెలివిగా ఒక ఎత్తు వేశాను. ఇక చివరి పరీక్ష ఫలితాలు బహిరంగంగా ప్రకటిస్తారనగా, ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళేటప్పుడు నాతోబాటు ఒక సహాధ్యాయిని కూడా రమ్మన్నాను.

“నువ్వు కూడా రా; నాకో సాక్షి కావాలి,” అన్నాను మా వాడితో. “ఆ ప్రొఫెసరుగారి నమ్మకాన్ని వమ్ము చేయడంలో నేను విఫలుణ్ణయితే నాకెంతో నిరాశ కలుగుతుంది.”

నా పేపరుకు ఆయనిచ్చిన మార్కులెన్నో చెప్పమని నేను అడిగినప్పుడు ప్రొఫెసర్ ఘోషాల్‌గారు తల ఆడించాడు.

“పాసయిన వాళ్ళలో లేవు నువ్వు,” అన్నారాయన ఏదో సాధించానన్న గర్వంతో. తమ బల్లమీదున్న పెద్ద కాయితాల బొత్తి కెలికి చూశారు. “పేపరు లేనే లేదిక్కడ: ఏమయినా, పరీక్షకి గైర్‌హాజరు కావడంవల్ల నువ్వు ఫెయిలయావు.”

నేను ముసిముసిగా నవ్వాను. “సార్, నేను హాజరయానండి! పోనీ, ఆ కట్టలో నేను వెతుక్కోనాండీ?”

ఆ ప్రొఫెసరుగారు ఇరకాటంలో పడి, నాకు అనుమతి ఇచ్చారు. నా హాజరుపట్టి నంబరు తప్ప, మరే గుర్తూ లేకుండా నేను జాగ్రత్తపడ్డ పేపరును తొందరగానే పట్టుకున్నాను.

“ఎర్ర జెండా” లాంటి నా పేరు ఆయన్ని హెచ్చరిస్తూ అక్కడ లేకపోవడంవల్ల ఆ ప్రొఫెసరుగారు, పాఠ్యపుస్తకాల్లోంచి ఉదాహరించిన