పుట:Oka-Yogi-Atmakatha.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

378

ఒక యోగి ఆత్మకథ

అంటూ ఇంకా చెప్పాడు విష్ణు. “ఒకనాడు ఆయనా నేనూ, చిరునవ్వు చిందిస్తున్న రమ ఫోటోగ్రాఫు కేసి చూస్తున్నాం.”

“ ‘ఎందు కా చిరునవ్వు?’ అంటూ చటుక్కున పైకి అనేశారు సతీశ్‌గారు, భార్య ఎదురుగానే ఉందన్నట్టు. ‘నా కన్న ముందుగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైన దాన్ననుకుంటున్నావు. నువ్వు నాకు దూరంగా అట్టేకాలం ఉండలేవని నిరూపిస్తాను; త్వరలోనే నిన్ను కలుసుకుంటాను.”

“ఇది జరిగేనాటికి సతీశ్‌గారు జబ్బునుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం అద్భుతంగానే ఉన్నప్పటికీ, ఈ ఫొటోముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్ళకే ఆయన చనిపోయారు; కారణమేదీ పైకి కనిపించలేదు.”

ఈ విధంగా మా అక్కయ్య రమా, ఆవిడ భర్తా- సాధారణ ప్రాపంచిక వ్యక్తిగా ఉండి, దక్షిణేశ్వరంలో మౌన సాధువుగా మారిపోయిన సతీశుగారూ - ఇద్దరూ ముందుగా చెప్పి గతించారు.