పుట:Oka-Yogi-Atmakatha.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాతిబొమ్మ గుండె

377

“తమ్ముడూ, నేను బాగున్నాను, మా ఆయన జబ్బులో ఉన్నారు. అయినప్పటికీ, హిందూ పతివ్రతగా, మొట్టమొదట పోయేదాన్ని నేనేనని నీకు తెలియాలి.[1] నేను పోవడానికి ఇక అటేకాలం పట్టదు.”

ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపడినప్పటికీ ఆ మాటల్లో చేదునిజం ఉందని గ్రహించాను. తాను ఈ జోస్యం చెప్పిన సుమారు పద్దెనిమిది నెల్లకి ఆమె కన్ను మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. మా చివరి తమ్ముడు విష్ణు, ఆ తరవాత నాకు వివరాలు తెలియజేశాడు.

“రమ చనిపోయేనాటికి ఆమే, సతీశ్ బావగారూ కలకత్తాలో ఉన్నారు. ఆ రోజు పొద్దున తను పెళ్ళికూతురి ముస్తాబు చేసుకుంది.”

“ ‘ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి?’ అని సతీశ్‌గారు అడిగారు.

“ ‘ఈ భూమిమీద మీకు సేవ చెయ్యడానికి ఇదే నాకు చివరి రోజు,’ అని రమ సమాధానం, తరవాత కాస్సేపటికి తనకి గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం కోసం కొడుకు బయటికి పరిగెడుతుంటే తను ఇలా చెప్పింది:

“ ‘బాబూ, నన్ను వదిలి వెళ్ళకు. దానివల్ల లాభం లేదు. డాక్టరు రాకముందే నేను వెళ్ళిపోతాను.’ తరవాత పదినిమిషాలకి రమ, భక్తి పూర్వకంగా భర్త పాదాలు పట్టుకొని, బాధ లేకుండా, హాయిగా, పూర్తి స్పృహతో దేహాన్ని విడిచింది.

“భార్య గతించిన తరవాత సతీశ్‌లో ఇలా వైరాగ్యం వచ్చింది,”

  1. భర్తకు తాను చిత్తశుద్ధితో సేవ చేసినందుకు నిదర్శనంగా భర్తకన్న భార్యే ముందు పోవడం, లేదా “సేవావిధులు నిర్వహిస్తూ కన్ను ముయ్యడం” ఆధ్యాత్మిక ప్రగతికి చిహ్నమని విశ్వసిస్తుంది హిందూ ధర్మపత్ని.