పుట:Oka-Yogi-Atmakatha.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

376

ఒక యోగి ఆత్మకథ

ఆ మర్నాడు మా అక్కయ్యగారింటికి వెళ్ళి కలుసుకున్నాను. నన్ను ఆప్యాయంగా పలకరించింది.

“ఒరే తమ్ముడూ! ఎంత అద్భుతం జరిగిందిరా! నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుట పైకి ఏడ్చేశారు.

“ ‘ప్రియదేవీ,’ నన్ను మార్చడానికి మీ తమ్ముడు చేసిన పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు చాలవు. నేను నీకు చేసిన అన్యాయాలన్నిటినీ ఇప్పుడు చక్కదిద్దుకుంటాను. ఈ రోజు రాత్రినించి మన పెద్ద పడగ్గదిని పూజా మందిరంగానే వాడుకుందాం; నువ్వు ధ్యానంచేసుకునే చిన్నగది మనకు పడకటిల్లవుతుంది. మీ తమ్ముణ్ణి వెక్కిరించినందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. ఇంతకాలమూ నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చినందుకు నేను ఆధ్యాత్మికమార్గంలో అభివృద్ధి సాధించేదాకా ముకుందుడితో మాట్లాడ్డం మానేసి నన్ను నేను శిక్షించుకుంటాను. ఇప్పటినించి నేను జగన్మాతను గాఢంగా ధ్యానిస్తూ అన్వేషిస్తాను; ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి!”

చాలా ఏళ్ళ తరవాత (1936 లో) ఢిల్లీలో, మా బావగారిని చూడడానికి వెళ్ళాను. ఆత్మసాక్షాత్కార సాధనలో గొప్ప అభివృద్ధిసాధించడం, జగన్మాత ఆయనకి దర్శనం ప్రసాదించడం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను. సతీశ్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నా, పగలంతా ఆఫీసు పనితోనే సరిపోతున్నా, ప్రతిరాత్రీ ఎక్కువభాగం గాఢమైన ధ్యానంలోనే రహస్యంగా గడుపుతూ ఉండడం గమనించాను, నేను ఆయన దగ్గర బసచేసినప్పుడు.

మా బావగారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండదన్న ఆలోచన ఒకటి వచ్చింది నాకు. నా మనస్సులో ఉన్నది గ్రహించింది రమ.