పుట:Oka-Yogi-Atmakatha.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాతిబొమ్మ గుండె

375

“ఇదుగో, ఇదే చెబుతున్నాను; ముందు ఏర్పాట్లేమీ లేకుండా, నీ జగన్మాత మనకిక్కడ భోజనం పెడుతుందేమో నేనూ చూస్తా!” అంటూ అరిచాడు సతీశ్.

ఆయన ఆ మాట లింకా అన్నాడోలేదో, గుడి పూజారి ఒకాయన ముంగిలికి అడ్డుబడి మా దగ్గరికి వచ్చాడు.

“బాబూ,” అంటూ నా కేసి చూసి అన్నాడు: “గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈ రోజు పొద్దున మీరు రావడం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కకి పెట్టాలన్న కోరిక కలిగింది నాకు. ముందుగా అడగనివాళ్ళకి అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకి విరుద్ధం; అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను.”

నే నాయనకి ధన్యవాదాలు చెప్పి సతీశ్ కళ్ళలోకి సూటిగా చూశాను. ఆయన లోపల్లోపల పశ్చాత్తాప పడుతూ కళ్ళుదించుకుని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు. ఆ కాలంలో రాని మామిడిపళ్ళతో సహా, మాకు మృష్టాన్న భోజన పదార్థాలు వడ్డించినప్పుడు, మా బావగారి ఆకలి అతిస్వల్పమేనని గమనించాను. ఆలోచనా సముద్రంలో లోతుగా మునుగుతూ ఆయన తబ్బిబ్బు అయిపోయాడు.

కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో, సతీశ్ ముఖంలో బింకం సడలిపోయింది; అప్పుడప్పు డాయన నావేపు బుజ్జగింపు ధోరణిలో చూస్తూ వచ్చాడు. అయితే ఆ గుడి పూజారి, సతీశ్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వడానికే అన్నట్లుగా, మమ్మల్ని భోజనానికి రమ్మన్న క్షణం నుంచి మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడలేదాయన.