పుట:Oka-Yogi-Atmakatha.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

374

ఒక యోగి ఆత్మకథ

“జగన్మాతా, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు?” అని ప్రార్థించాను.

ఇంతవరకు మౌనంగానే ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరువిప్పి మాట్లాడింది. “నీ కోరిక నెరవేరుతుంది!”

సతీశ్ వేపు సంతోషంగా చూశాను నేను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పని చేస్తోందని సహజ ప్రవృత్తివల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన, నేలమీద కూర్చున్న చోటునుంచి రోషంగా లేచాడు. ఆయన గుడివెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు; తన పిడికిలి ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు.

సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమయింది. అమ్మవారి దివ్య మంగళమూర్తి అవుపించడం మానేసింది; ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకొని తిరిగి మామూలు పరిమాణాన్ని పొందింది. మళ్ళీ నా ఒళ్ళు, సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమల మాడుతోంది. ముఖ మంటపం నీడలోకి ఒక్క గంతు వేశాను; సతీశ్ మండిపడుతూ నన్నక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. ఒంటిగంటయింది; దివ్య దర్శనం గంటసేపు ఉందన్నమాట.

“ఓయి తెలివితక్కువ నాయనా, కాళ్ళు మెలివేసుకుని కళ్ళు తేల వేసుకుని గంటలగ్గంటలు కూర్చున్నావక్కడ. నిన్ను గమనిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. మన భోజన మెక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు; గుడి అధికారులికి నువ్వు మన సంగతి చెప్పకపోతివి; మన భోజనాల ఏర్పాటుకు టైము చాలా మించిపోయింది!”

అమ్మవారి సాక్షాత్కారంతో కలిగిన ఉత్కృష్టస్థితి నాలో ఇంకా ఉంది. “జగన్మాతే మన కడుపు నింపుతుంది!” అన్నాను.