పుట:Oka-Yogi-Atmakatha.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

372

ఒక యోగి ఆత్మకథ

“నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు; ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కుని ఉన్నావు. ఈ రోజు నేను మా బావగారి తరఫున నీకు ప్రత్యేక ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను.”

మనస్సులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది. మొదట, నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి, పాదాలకింద ఆహ్లాదకరమైన చలవ అల ఒకటి పాకి వచ్చింది. ఆ తరవాత, ఆ ఆలయం పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలావిగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవరూపంగా మారింది; చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది; చెప్పనలవికాని ఆనందంతో నన్ను పులకరింపజేసింది. కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది; నా శరీరం జడప్రాయం కాకపోయినా అతినిశ్చలమయిపోయింది.

ఆ తరవాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తార మయింది. నా ఎడమవేపు గంగానది మీద అనేక మైళ్ళదురం స్పష్టంగా చూడగలిగాను, అంతే కాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళకు కట్టింది. భవనాలన్నిటి గోడలూ పారదర్శకంగా ప్రకాశించాయి; వాటిగుండా నేను, దూరభూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను.

నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ, నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ, నేను చేతులూ కాళ్ళూ స్వేచ్ఛగా కదపగలిగాను. కొన్ని నిమిషాలసేపు నేను కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను: మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను.

ఎక్స్-రే లనే కిరణాల మాదిరిగా, ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల