పుట:Oka-Yogi-Atmakatha.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

ఒక యోగి ఆత్మకథ

ముడుచుకుని గమ్మున కూర్చున్నాడు. మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన వెటకారంగా పళ్ళు ఇకిలించాడు.

“ఈ విహారయాత్ర, బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకమనుకుంటాను.”

నేను దానికి జవాబు చెప్పకుండా పక్కకి తిరిగేసరికి, ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు.

“ఇదుగో, కుర్ర సన్యాసిగారూ, దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనాలకి తగ్గ ఏర్పాట్లు చెయ్యడంమాత్రం మరిచిపోకండి!” గుడి పూజారులతో ఎటువంటి సంభాషణా చేసే అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీశ్‌గారు.

“నే నిప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను. మీ భోజనంగురించి దిగులు పడకండి,” అని కరుకుగా జవాబిచ్చాను. “ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది.”

“నా కోసం అమ్మవారు ఒక్క పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు, కాని నా భోజనానికి నిన్నే బాధ్యుణ్ణి చేస్తున్నాను.” సతీశ్ గారి మాటల్లో బెదిరింపు ఉంది.

కాళికాదేవి (ప్రకృతిమాత రూపంలో ఉన్న దేవుడు) విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖమంటపంలోకి నే నొక్కణ్ణీ సాగాను. ఒక స్తంభం దగ్గిర నీడపట్టు చూసుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. అప్పటికే సుమారు ఏడుగంటలయి ఉంటుంది కాని, మరి కాస్సేపట్లో బాగా పొద్దెక్కి ఎండ మాడ్చేస్తుంది.

నేను భక్తితత్పరుణ్ణయి సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న కొద్దీ బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది. నా మనస్సు కాళికాదేవి మీద ఏకాగ్రంగా