పుట:Oka-Yogi-Atmakatha.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

363

ఈ విధంగా వాళ్ళు అత్యంతపరిశుద్ధులై, ఉత్తరోత్తరా తమకు సిద్ధించే సర్వవ్యాపక చైతన్యాన్ని లేదా హోలీ ఘోస్ట్‌ను (పరిశుద్ధాత్మను) ధరించడానికి అర్హత పొందారు.[1]

కేవలం ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చెయ్యడంకాని, ఇతరుల జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోడం కాని చెయ్యగలడు. మామూలు మనిషి, రోగనివారణ చేసే ఈ యోగపద్ధతిని అవలంబించలేడు; అతనలా చెయ్యడం ఆశించదగ్గది కూడా కాదు. ఎంచేతంటే, అనారోగ్యమైన శరీర సాధనం, గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోడం అతని విద్యుక్తధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తాయి; లేకపోతే అతని మనస్సు భక్తితత్పరమైన ఏకాగ్రతలో కుదురుగా నిలబడ లేదు.

అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నిటినీ అధిగమించి ఆత్మసాక్షాత్కారం సిద్ధింపజేసుకో గలదు, అనేకమంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చెయ్యకుండా దైవాన్వేషణలో విజయం పొందారు. సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు; అంతే కాదు, చచ్చిపోయిన వాళ్ళను బతికించాడు కూడా.

వెనక నాకు తెలిసిన భారతీయ సాధువు కొకాయనకు తొలినాళ్ళలో ఒంట్లో సగభాగంవరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహవ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే, పట్టుమని పదిహేను నిమిషాలపాటు నిలకడగా ఒక చోట కూర్చోలేకపోయేవాడు. కాని ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం దుర్నిరోధమైనది. “ప్రభూ, నా శిథిలాలయంలోకి

  1. యాక్ట్స్ 1 : 8, 2 : 1-4 (బైబిలు).