పుట:Oka-Yogi-Atmakatha.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

362

ఒక యోగి ఆత్మకథ

శారీరక బాధను గంభీరంగా ఓర్చుకోదలుస్తాడు. ఇతరుల జబ్బుల్ని తాను వహించడంవల్ల యోగి, వాళ్ళకోసం, కర్మసంబంధమైన కార్యకారణ నియమాన్ని పాటిస్తాడు. ఈ నియమం యాంత్రికంగా లేదా గణితశాస్త్రీయంగా పనిచేస్తుంది; దివ్యజ్ఞానం కలిగిన వ్యక్తులు, అది పనిచేసే తీరు తెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు.

ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయంచేసినప్పుడల్లా తాను జబ్బుపడవలసిన అవసరం, ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హానీ కలక్కుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండడంవల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చెయ్యడం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు, తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని అతిత్వరితంగా రప్పించాలని ఆశించినప్పుడు, వాళ్ళ అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు.

అనేకమంది చేసిన పాపాలకు ఏసుక్రీస్తు, తనను పరిహారంగా నిరూపించుకున్నాడు. తనకున్న దివ్యశక్తులకు[1] క్రీస్తు, కార్యకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వనియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే శిలువ వెయ్యడంవల్ల చనిపోవలసిన స్థితికి ఒక్క నాటికి లోనయ్యేవాడు కాడు. ఆ ప్రకారంగా ఆయన ఇతరుల కర్మ ఫలాల్ని, ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాల్ని, తనమీద వేసుకొన్నాడు.

  1. ఇక శిలువ వెయ్యడానికి తీసుకువెళ్తారనగా క్రీస్తు ఇలా అన్నాడు: “నేను నా తండ్రిని ఇప్పుడు ప్రార్థించలేననీ, ఆయన ఇప్పటికిప్పుడు నాకు పన్నెండు సైనికదళాలకు మించి దేవదూతల్ని ఇవ్వడనీ అనుకుంటున్నారా? కాని అలా జరిగినట్లయితే పవిత్రగ్రంథాల్లో చెప్పింది నెరవేరడం ఎలా? అది నెరవేర కుండా ఉండడం ఎలా?” మత్తయి 26 : 53- 4 (బైబిలు).