పుట:Oka-Yogi-Atmakatha.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

357

స్సుకు, జలమయమైన సాలెగూడు వంటి కాలవలు అల్లుకొని ఉన్నాయి. వాటిలో చాలాసార్లు తిరిగాం. ఇక్కడ నీటిమీద తేలే తోటలు లెక్కలేనన్ని ఉన్నాయి. కొయ్యబాదులూ మట్టీ పెట్టి నాటురకంగా తయారుచేసిన ఈ తోటలు చూసి దిగ్భ్రమ చెందుతాం; నీళ్ళమధ్య కూరగాయలూ, పుచ్చ కాయలూ పెరుగుతూ కనిపించడమే పెద్ద విడ్డూరం. అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు; ‘నేలకు పాతుకుపోయి ఉండడ’ మంటే రోత పుట్టి కాబోలు, తన నల్చదరం “భూమి”ని, అనేక శాఖలు గల ఆ సరస్సులో మరో కొత్తచోటికి లాక్కుపోతూ ఉంటాడు.

ఈ అంతస్తుల లోయలో ప్రపంచం అందాలన్నీ సూక్ష్మరూపంలో ఆవిర్భవించినట్టు అవుపిస్తాయి. కాశ్మీర పట్టమహిషికి కొండలే కిరీటం, సరస్సులు పుష్పహారాలు, పూలు పాదరక్షలు. తరవాత కొన్నేళ్ళకు నేను అనేక దేశాల్లో పర్యటించిన తరవాత, కాశ్మీరును ప్రపంచంలోకల్లా అందమైన ప్రకృతి దృశ్యాలుగల ప్రదేశంగా తరచు ఎందుకంటూ ఉంటారో అవగాహన చేసుకున్నాను. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాలకు, స్కాట్లండ్‌లోని లాచ్ లోమండ్‌కు, అద్భుతమైన ఇంగ్లీషు సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దానికి ఉన్నాయి. కాశ్మీరువచ్చే అమెరికా యాత్రికుడికి, అలాస్కాలోని ఎగుడుదిగుడు కొండల శోభనూ డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిఖరాన్నీ గుర్తుకు తెచ్చేవి చాలా ఉన్నాయి.

ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను, మెక్సికోలోని జోఖిమిల్కో అద్భుత దృశ్యాన్ని కానీ, కాశ్మీరులోని సరస్సుల్ని కాని పోటీకి నిలబెడతాను. జోఖిమిల్కోలోని అనేక జలదారులలో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులూ, కొండలూ, పాప్లర్‌చెట్లూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాశ్మీరు సరస్సులు అందాల కన్నెలయితే, వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదల కల్పించేవి హిమాలయాలు.