పుట:Oka-Yogi-Atmakatha.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

ఒక యోగి ఆత్మకథ

ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా చేతిమీద పూసుకున్నాను.

“బాగున్న చేతికి మందు పుయ్యడమెందుకు?”

“రేపు నాకో కురుపు వేస్తుందని అనిపిస్తోందక్కా! కురుపు వెయ్యబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను.”

“ఓరి అబద్ధాలకోరూ!”

“అక్కా, నన్ను అబద్ధాలకోరనకు; రేప్పొద్దున ఏం జరుగుతుందో చూసి అను.” నాకు ఉడుకుబోత్తనం వచ్చింది.

ఉమకి నా మాటమీద నమ్మకం కలగలేదు; అదే మాట మూడుమాట్లు ఎత్తి పొడిచింది, నేను మెల్లిగా జవాబు చెబుతూంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది.

“నాకున్న సంకల్ప శక్తివల్ల, రేప్పొద్దున్నకి నా చేతిమీద సరిగ్గా ఇదుగో, ఇక్కడ, బాగా పెద్దకురుపు ఒకటి వెయ్యాలి; నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు అవాలిగాక!”

తెల్లవారేసరికి, నేను చెప్పినచోట నా చేతిమీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది; ఉమ కురుపు రెట్టింపయింది. దాంతో అక్క కెవ్వున అరిచి అమ్మదగ్గరికి పరుగెత్తింది. - “ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా!” మాటలకున్న శక్తిని, అపకారం చెయ్యడానికి ఎన్నడూ ఉపయోగించ వద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తు పెట్టుకొని అనుసరించాను.

ఆపరేషన్‌చేసి నా కురుపు నయంచేశారు. డాక్టరు, కోతపెట్టినచోట అయిన మచ్చ ఈ నాటికీ ఉంది. మనిషి పలికే ఒట్టిమాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తుచేసే మచ్చ నా కుడిచేతిమీద ఉంది.