పుట:Oka-Yogi-Atmakatha.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

ఒక యోగి ఆత్మకథ

“గురుదేవా, మీ పావన సాహచర్యంలో ఈ మనోహరదృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి,” అంటూ గురుదేవులతో అన్నాడు ఆడీ. ఆ ప్రయాణానికి నేను ఆతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల, ఆడీ మెప్పుకి నాలో రవ్వంత ఉల్లాసం పెల్లుబికింది. శ్రీయుక్తేశ్వర్‌గారు నా ఆలోచన పసిగట్టారు; నావేపు తిరిగి గుసగుసలాడారు:

“నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు; ఆడీ, మనని విడిచిపెట్టి పోయి ఒక సిగరెట్టు కాల్చుకురావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవడం లేదు,” అన్నారాయన.

నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను. “గురుదేవా, మీరు దయచేసి ఇలాటి వెగటు మాటలతో మా పొత్తు చెడ గొట్టకండి. ఆడీ ఒక దమ్ముకోసం ఆరాటపడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను.” మామూలుగా, ఎవరూ అదుపుచెయ్యడానికి లొంగని మా గురుదేవుల వేపు అనుమానంగా చూశాను నేను.

“సరేలే, నేను ఆడీతో ఏమీ అనను,” అంటూ గురుదేవులు ముసి ముసిగా నవ్వారు. “కాని నువ్వే కాసేపట్లో చూస్తావు; మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు.”

మా బండి ఒక చిన్న కారవాన్‌సెరాయి దగ్గిరికి చేరుకుంది. మా గుర్రాల్ని నీళ్ళు పట్టడానికి తోలుకువెళ్తూ ఉండగా, ఆడీ అడిగాడు, “గురుదేవా, నేను బండివాడితో బాటు కాసేపు అలా స్వారి చేసివస్తే మీకు అభ్యంతరమాండి? నాకు కొంచెం బయటిగాలి పీల్చుకోవాలని ఉంది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు అనుమతి ఇచ్చారు. కాని, “అతనికి కావలసింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము,” అన్నారాయన నాతో.