పుట:Oka-Yogi-Atmakatha.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

351

ఆవిడ ఫోర్కుతో బాగా ఎనిపిన తరవాత నువ్వు రుచి చూసి, ‘ఎంత రుచిగల స్ట్రాబెరీలు!’ అంటావు. అప్పుడు నీకు గుర్తు వస్తుంది, సిమ్లాలో ఈ రోజు.

(శ్రీయుక్తేశ్వర్‌గారు చెప్పిన జోస్యం నా మనస్సులోంచి తొలగిపోయింది. కాని మూడేళ్ళ తరవాత, నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తల్లో మళ్ళీ మనస్సులో మెదిలింది. మెసాచుసెట్స్‌లోని వెస్ట్ సోమర్విల్ లో మిసెస్ ఆలిస్ టి. హేసీ అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోజనాల బల్లమీద స్ట్రాబెరీల డిసర్ట్ పెట్టినప్పుడు, మా ఆతిథేయిని ఒక ఫోర్కు తీసుకొని, బెరీపండ్లకు మీగడా పంచదారా కలిపి, వాటిని బాగా ఎనిపింది. “ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది; దీన్నిలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను,” అన్నదామె. నేను నోరుపట్టినంత తీసి పెట్టుకున్నాను. “ఎంత రుచిగల స్ట్రాబెరీలు!” అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. వెంటనే, సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం, ఆగాఢమైన నా స్మృతిగహ్వరంలోంచి బయల్పడింది. దైవానుసంధాన శీలకమైన ఆయన మనస్సు చాలాకాలం కిందటే, భవిష్యదాకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిభుణ్ణయాను).

త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి, రావల్పిండి బండి ఎక్కింది. అక్కడ మేము జోడుగుర్రాలు పూన్చిన గూడుబండి ఒకటి అద్దెకు తీసుకుని శ్రీనగర్‌కు ప్రయాణమయాం; శ్రీనగర్ కాశ్మీరుకు రాజధాని. మేము ఉత్తరదిశకు ప్రయాణం సాగించిన రెండోనాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటబడింది. మా బండికున్న ఇనప చక్రాలు, మలమల మాడుతున్న రాతిగొట్టు బాటల్లో కీచుమని రొదచేస్తూ సాగుతూ ఉండగా, ఆ పర్వతశోభలో మారుతున్న తరుశ్రేణుల రామణీయకతకు మేమంతా ముగ్ధులమయిపోయాం.