పుట:Oka-Yogi-Atmakatha.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

ఒక యోగి ఆత్మకథ

“చాలా సంతోషం ముకుందా. నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చెయ్యగలిగింది ఏమన్నా ఉందా?”

ఆదరపూర్వకమైన ఈ మాటలలో నాలో ఉత్సాహం పెల్లుబికింది. “బాబయ్యా, నువ్వు మీ నౌకరు లాల్‌ధారీని పంపించగలవా?”

నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పని చేసింది. మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచేసరికి, కుర్చీ తిరగబడి, బల్లమీది కాయితాలు అన్ని వేపులకీ చెల్లాచెదరుగా ఎగిరిపోయి, కొబ్బరి చిప్పతో చేసిన, ఆయన పొడుగాటి హుక్కాగొట్టం చటుక్కున కిందపడి పెద్ద రణగొణధ్వని అయింది.

“ఓరి స్వార్థపరుడా! ఎంత విపరీతపు ఆలోచన! నా నౌకర్ని కాస్తా నువ్వు నీ విలాసయాత్రకి తీసుకుపోతే, ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్ళెవర్రా?” అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడాయన.

నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా, సౌమ్యుడైన మా బాబయ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు, ఈవేళంతా జరిగిన అగమ్యగోచరమైన సంఘటనలకు మరొకటి తోడయినట్టు భావించాను. కోర్ట్ హౌస్ నుంచి నేను తిరుగుమొగం పట్టడంలో హుందాతనం కంటె కంగారే ఎక్కువగా ఉంది.

నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను. అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురుచూస్తూ గుమిగూడి ఉన్నారు. గురుదేవుల ధోరణి ఏ మాత్రం అంతుబట్టకపోయినా, తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది. గురుదేవుల సంకల్పాన్ని ఉల్లంఘించినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది.

“ముకుందా, మరి కాసేపు నా దగ్గిర ఉండవా?” అని అడిగారు