పుట:Oka-Yogi-Atmakatha.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

324

ఒక యోగి ఆత్మకథ

“బిత్తరపోయిన ఆ కుర్రవాడికి జటిలమైన యోగప్రక్రియ ఒకటి ఉపదేశించి, ఆ గురువు అంతర్ధానమయాడు.”

“అఫ్జల్ ఇరవై ఏళ్ళపాటు ఆ యోగప్రక్రియను చిత్తశుద్ధితో సాధన చేశాడు. అతని అద్భుత చర్యలు ఎక్కడెక్కడివాళ్ళనీ ఆకర్షించడం మొదలు పెట్టాయి. అతని వెంట ఎప్పుడూ ఒక అశరీరాత్మ తోడు ఉండేదనుకుంటాను. దాన్ని అతను ‘హజరత్’ అని పిలిచేవాడు. ఈ అశరీరాత్మ అతను కోరిన ఏ చిన్న కోరికనయినా సరే నెరవేరుస్తూ ఉండేది.

“గురువు చేసిన హెచ్చరికను విస్మరించి, అఫ్జల్ తన శక్తుల్ని దుర్వినియోగం చెయ్యడం ప్రారంభించాడు. అతడు ఏ వస్తువునయినా ఒకసారి ముట్టుకుని మళ్ళీ అక్కడ పెట్టేస్తే చాలు, కాసేపట్లో ఆ వస్తువు అయిపులేకుండా అదృశ్యమయిపోయేది. జనాన్ని గాభరాపెట్టే ఈ పర్యవసానం వల్ల అతను ప్రతి చోటికీ, రాకూడని అతిథి అయాడు!

“అతను కలకత్తాలో పెద్ద పెద్ద నగల దుకాణాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు , ఏదో కొనడానికి వచ్చినవాడిలా కనిపించేవాడు, అతను ఏదైనా ఒక నగ పట్టుకున్నాడంటే, అతను దుకాణంలోంచి బయటికి రాగానే ఆ నగ మాయమయిపోయేది.

“అఫ్జల్ వెంట తరచుగా వందలకొద్దీ విద్యార్థులు చుట్టుముట్టి ఉండేవారు. అతని రహస్యాలేవయినా నేర్చుకోవచ్చునన్న ఆశ వాళ్ళని అలా ఆకర్షించేది. అప్పుడప్పుడా ఫకీరు, వాళ్ళని తనతోపాటు ప్రయాణానికి రమ్మని పిలుస్తుండేవాడు. రైల్వే స్టేషనులో ఎలాగో ఒక టిక్కెట్ల బొత్తి ముట్టుకొనే అవకాశం కల్పించుకునేవాడు. దాన్ని మళ్ళీ గుమాస్తా దగ్గరికి నెట్టేసి, ‘నా మనస్సు మార్చుకున్నాను. అవి ఇప్పుడు కొనను’ అనే వాడు.