పుట:Oka-Yogi-Atmakatha.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శశి, మూడు నీలాలు

315

వెళ్ళాడు. శ్రీయుక్తేశ్వర్‌గారి కాళ్ళమీద పడి, అందమైన మూడు నీలాలు అక్కడ పెట్టాడు.

“సర్వజ్ఞులైన గురుదేవా, నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. ఇంక మూడునెల్లే ఆయుర్దాయ ముందంటున్నారు. మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయ పడుతున్నాను; మీరు నయం చెయ్యగలరని నాకు తెలుసు!”

“నీ జీవితాన్ని గురించి ఆందోళనపడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదూ? నీ మణులు నువ్వు తీసుకువెళ్ళిపో; వాటి ఉపయోగం అయిపోయింది. ఆ తరవాత గురుదేవులు మాటాపలుకూ లేకుండా బింకంగా కూర్చున్నారు. మధ్యమధ్య ఆ అబ్బాయి దయతలచమని ఆక్రందన చేస్తున్నాడు.

రోగనివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైనదో కేవలం పరీక్షించడానికే శ్రీయుక్తేశ్వర్‌గారు ఇలా చేస్తున్నారన్న దృఢవిశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది. ఒక గంటసేపు బింకంగా ఉన్న తరవాత గురుదేవులు, తమ కాళ్ళదగ్గిర పడిఉన్న కుర్రవాడి మీద జాలి చూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు.

“లే శశీ! పరాయివాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు? ఈ నీలాలు దుకాణంలో తిరిగి ఇచ్చెయ్యి. వాటివల్ల అనవసరపు ఖర్చు ఇప్పుడు. అయితే గ్రహశాంతికి పనికివచ్చే కడియం తెచ్చి వేసుకో. భయపడకు; కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది.”

కన్నీళ్ళతో తడిసి ముద్దయిన శశి ముఖంలో విరిసిన చిరునవ్వు, నానిన నేలమీద చటుక్కున పడ్డ ఎండలా ఉంది. “గురుదేవా, డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా?”